Malla Reddy Daughter in-law : విమానంలో ప్రాణాలు కాపాడిన మల్లారెడ్డి కోడలు

విమాన ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడి ప్రాణాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి సమయస్ఫూర్తితో కాపాడారు. శనివారం రాత్రి ఇండిగో విమానంలో జరిగిన ఈ సంఘటనలో, ఆమె చేసిన సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) వృద్ధుడికి పునర్జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, 74 ఏళ్ల వయసున్న ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయన అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో పాటు, నోటి నుంచి ద్రవం బయటకు రావడం ప్రారంభమైంది.
తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రీతి రెడ్డి ఈ పరిస్థితిని గమనించి తక్షణమే స్పందించారు. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె, ఆ వృద్ధుడిని ప్రాథమికంగా పరీక్షించారు. ఆయన రక్తపోటు (బీపీ) బాగా తగ్గిపోయిందని నిర్ధారించుకున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే సీపీఆర్ ప్రక్రియను ప్రారంభించారు. కొంత సమయం పాటు ఆమె చేసిన ప్రయత్నం ఫలించి, వృద్ధుడి పరిస్థితి కొంత మెరుగుపడింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే, విమానాశ్రయ సిబ్బంది ఆ వృద్ధుడిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com