Gwalior: నాలుగు రోజుల్లో పెళ్లి.. నాన్నే కూతురిని చంపేశాడు

నాన్న కుదిర్చిన పెళ్లి నాలుగురోజుల్లో ఉంది. కూతురికి ఆ పెళ్లి ఇష్టం లేదు. ఆమె వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంది. తండ్రికి చెప్పినా వినిపించుకోలేదు. పరువు, మర్యాద అంటూ కూతురి ప్రేమను వ్యతిరేకించాడు.. కోపంతో కన్నబిడ్డను కాల్చి చంపేశాడు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ వ్యక్తి తన 20 ఏళ్ల కుమార్తెను పోలీసు అధికారుల ముందే కాల్చి చంపిన ఘటన కలకలం రేగింది. కూతురు తనూ గుర్జార్ తన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన వివాహాన్ని వ్యతిరేకిస్తూ, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది.
నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. బాధితురాలి తండ్రి, మహేష్ గుర్జార్, తన కుమార్తె సోషల్ మీడియాలో ఆ రోజు ముందు పోస్ట్ చేసిన వీడియోతో కోపోద్రిక్తుడైనాడు.
తన హత్యకు కొన్ని గంటల ముందు, తనూ తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోమని తన కుటుంబం ఒత్తిడి చేసిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వీడియోను రికార్డ్ చేసి షేర్ చేసింది. 52 సెకన్ల నిడివి గల వీడియోలో, తన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణభయం ఉందని ఆరోపించింది.
"నేను విక్కీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా కుటుంబం మొదట అంగీకరించింది, కానీ తరువాత నిరాకరించింది. వారు నన్ను రోజూ కొడుతున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబం బాధ్యత వహిస్తుంది" అని వీడియోలో పేర్కొంది.
ఆమె సూచించిన వ్యక్తి, భికం "విక్కీ" మావాయి, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నివాసి. ఆరు సంవత్సరా నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. వీడియో వైరల్ అయిన తర్వాత, సూపరింటెండెంట్ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీసు అధికారులు తనూ ఇంటికి వెళ్లి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
తనూ ఇంట్లో ఉండడానికి నిరాకరించింది. భద్రత కోసం వన్-స్టాప్ సెంటర్‌కు తీసుకెళ్లమని అభ్యర్థించింది. అయితే, ఆమె తండ్రి ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని పట్టుబట్టాడు. అంతలోనే మహేష్ తన కూతురి ఛాతీపై కాల్చాడు. అదే సమయంలో, బంధువు రాహుల్ కూడా తనూపై కాల్పులు జరిపాడు. తనూ వెంటనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
మహేష్, రాహుల్ తమ ఆయుధాలను పోలీసులు మరియు కుటుంబ సభ్యులపై తిప్పి వారిని కూడా బెదిరించారు. అయితే పోలీసులు మహేశ్‌ను లొంగదీసుకుని అరెస్ట్ చేసినా రాహుల్ మాత్రం వారికి దొరక్కుండా తప్పించుకున్నాడు.
జనవరి 18న జరగాల్సిన తనూ పెళ్లికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ హత్య జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com