Music Director Raj: సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత

Music Director Raj: సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ మరణవార్త తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.. కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న రాజ్‌.. కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో కన్నుమూశారు.. తన స్నేహితుడు, సంగీత దర్శకుడు కోటితో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మ్యూజిక్‌ అందించారు.. అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజు తనయుడే రాజ్‌.. ఈయన అసలు పేరు తోటకూర సోమరాజు.. రాజ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.. రాజ్‌ మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజ్‌ మరణాన్ని మ్యూజిక్‌ లవర్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎందరో సినీ అభిమానుల మనసు దోచుకున్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాజ్‌.. రాజ్‌-కోటి కాంబినేషన్‌ గురించి టాలీవుడ్‌లో తెలియనివారు ఉండరు.. నైన్టీస్‌లో రాజ్‌-కోటి ద్వయం తెలుగు సినీ పరిశ్రమను ఏలింది.. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాటా సూపర్‌ డూపర్‌ హిట్టే.. ప్రళయ గర్జన సినిమాతో రాజ్‌-కోటి ద్వయం తమ సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.. ఇద్దరూ కలిసి 180 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.. మూడు వేలకుపైగా పాటలకు స్వరాలు సమకూర్చారు.. బాలగోపాలుడు, యముడికి మొగుడు, బంగారు బుల్లోడు, హలోబ్రదర్‌, ముఠా మేస్త్రి.. ఇలా ఎన్నో హిట్‌ సినిమాలకు స్వరాలు అందించారు.. హలో బ్రదర్‌ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు.. ఆ తర్వాత కొన్నాళ్లకు మనస్పర్థలు రావడంతో రాజ్‌- కోటి విడిపోయారు.. కోటి నుంచి దూరమైన తర్వాత రాజ్‌ కొద్ది సినిమాలు మాత్రమే చేశారు.

అన్ని భాషల్లో కలిపి 455 చిత్రాలకు పనిచేసిన రాజ్‌.. 24 సినిమాలకు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు.. కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ఆయన దూరంగా ఉంటున్నారు.. రాజ్‌ మృతిపట్ల అభిమానులు, టాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.. మహా ప్రస్థానంలో రాజ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది..

Tags

Next Story