Oxfam Report : దేశంలో 40% సంపద వారిదే....
భారత దేశంలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న సంపన్నులు 40 శాతానికి పైగా దేశ సంపదను కలిగి ఉన్నారని ఆక్స్ఫామ్ సంస్థ తెలిపింది. జనవరి 16న విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని పది మంది ధనవంతులపై 5 శాతం పన్నును అధికంగా విధిస్తే... బడులకు దూరమైన పిల్లలందరిని తిరిగి స్కూల్స్ కు తీసుకురావచ్చని తెలిపింది. కేవలం గౌతమ్ అధాని 2017-2021 అవాస్తిక లాభాలపై ఒకే సారి పన్ను విధించడం ద్వారా రూ.1.79 లక్షల కోట్లు సమీకరించవచ్చని ఆక్స్ఫామ్ అభిప్రాయపడింది.
'సర్వైవల్ ఆఫ్ రిచ్చెస్ట్' పేరుతో రూపొందించిన నివేదిక ప్రకారం భారత్ లోని బిలియనీర్ల సంపదపై ఒకేసారి 2 శాతం పన్ను విధిస్తే.. రాబోయే మూడేళ్లలో దేశంలో పోషకాహార లోపం ఉన్నవారికి అవసరమయ్యే రూ.40,423 కోట్లను సమకూర్చుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు... దేశంలోని 10మంది సంపన్న బిలియనీర్లపై ఒకేసారి 5 శాతం పన్ను... ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ నిధుల కంటే 1.5 రేట్లు ఎక్కువ అనిపేర్కొంది. లింగ అసమానతపై ప్రతీ పురుష కార్మికుడు సంపాదించే ప్రతీ రూపాయిపై మహిళా కార్మికురాలు కేవలం 63 పైసలు మాత్రమే సంపాదిస్తున్నారని నివేదికలో పొందుపర్చింది.
టాప్ 100 భారతీయ బిలియనీర్లకు 2.5 శాతం పన్ను విధించడం లేదా టాప్ 10 భారతీయ బిలియనీర్లపై 5 శాతం పన్ను విధించడం వలన పిల్లలను పాఠశాలకు తీసుకురావడానికి అవసరమైన ధనం లభిస్తుందని ఆక్స్ఫామ్ తెలిపింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి నవంబర్ 2022 వరకు భారత్ లోని బిలియనీర్లు తమ సంపదను 121శాతం పెంచుకున్నారని తెలిపింది. దాదాపు రోజుకు రూ. 3,608 కోట్ల సంపద పెరిగిందని అంచనా వేసింది. మరోవైపు 2021-22లో మొత్తం రూ.14.83 లక్షల కోట్ల వస్తువులు, సేవల పన్ను దాదాపు 50శాతం దిగువన ఉన్న జనాభా నుంచి వచ్చిందని, GSTలో కేవలం 3 శాతం మాత్రమే ధనవంతుల నుంచి వచ్చిందని ఆక్స్ఫామ్ తన నివేదికలో పేర్కొంది.
ఆక్స్ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ మాట్లడుతూ... దేశంలోని అట్టడుగున ఉన్న దళితులు, ఆదివాసీలు, ముస్లింలు అనధికారికంగా అత్యంత ధనవంతుల మనుగడకోసం కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పారు. పేదలే ఎక్కువగా అధికపన్నులు చెల్లిస్తున్నారని, నిత్యవసర వస్తువులపై, సేవలపై అధిక ఖర్చు చేస్తున్నారని అన్నారు. ధనవంతులపై కూడా పన్ను విధించే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సంపద పన్ను, వారసత్వ పన్ను వంటి ప్రగతిశీల పన్నులను అమలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు అమిత్ బేహార్ చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com