
శంషాబాద్ నుంచి వైజాగ్‌కు కేవలం 4 గంటల్లోనే చేరుకునే సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది. గంటకు 220KM వేగంతో దూసుకెళ్లే ఈ రైలు విజయవాడ మీదుగా వైజాగ్ చేరుకుంటుంది. ఈ రూట్‌లో మొత్తం 12 స్టేషన్లుంటాయి. సర్వే తుది దశకు చేరగా నవంబర్‌లో రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ను నిర్మించనున్నారు.
ఏపీ, తెలంగాణలో మొదటి సెమీ హైస్పీడ్ కారిడార్ ఇదే కావడం విశేషం. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించనున్నారు. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్ రైళ్లలో స్వస్థలాలకు వేగంగా చేరుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు.
ఈ సెమీ హైస్పీడ్ కారిడార్ పూర్తయితే.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్- విశాఖ మధ్య రైలు ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మాత్రం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటోంది. సికింద్రాబాద్ -విశాఖ మధ్య ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంలో ఒకటి.. నల్గొండ, గుంటూరు, విజయవాడ ఈ మార్గం రెండోది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com