
ఆత్మహత్యకు పాల్పడిన ప్రముఖ గాయని కల్పన నిజాంపేటలోని హోలిస్టిక్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై బుధవారం డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులు ఉన్నా వేగంగా కోలుకుంటున్నారని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్లే అపస్మారకంలోకి వెళ్లినట్లు వివరించారు. లంగ్స్లో వాటర్ చేరడంతో వెంటి లేటర్ అవసరం అయిందని, ఇప్పుడు వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారని వైద్యులు పేర్కొన్నారు. 24 గంటలలో డిశ్చార్జి చేస్తామని హోలిస్టిక్ వైద్యులు తెలిపారు. కల్పన ఆత్మహత్యయత్నానికి కుటుంబ కలహాలే కారణమన్న కోణంలో పోలీసులు భావిస్తున్నారు.
ఆసుపత్రిలో ఆమె వాంగ్మూలం నమోదుచేశారు. కేరళలో చదవుకుంటున్న పెద్ద కూతురిని హైదరాబాద్ రమ్మని కోరానని, ఆమె మాత్రం కేరళలో ఉంటానని పట్టుబట్టిందని, దీంతో మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగానని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో కల్పన చెప్పినట్లు తెలుస్తోంది.
కల్పన పెద్ద కూతురు దయా ప్రసాద్ కేరళ నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూశారు. డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న కథనాలను తోసిపుచ్చారు. ఒత్తిడి గురవడంతో వైద్యులు ఇన్సోమ్నియా టాబ్లెట్ రాశారని, ఓవర్ డోస్ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని తెలిపారు. తమ కుటుంబం లో ఎటువంటి కలహాలు లేవని, మీడియా అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com