Telangana : తెలంగాణపై కర్ణాటక ప్రభావం

Telangana : తెలంగాణపై కర్ణాటక ప్రభావం

కర్ణాటక రాజకీయం తెలంగాణపైన ప్రభావం చూపుతోంది. 2023 ఎలక్షన్‌ ఈయర్‌ కావడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దక్షిణాదిపై కన్నేసిన కాషాయ పార్టీ కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకునీ.. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కన్నడ నాట బీజేపీ అగ్ర నేతలు, కేంద్రమంత్రులు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.అయితే సర్వేలు మాత్రం వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని అంచనా వేస్తున్నాయి.ఇవి కాంగ్రెస్‌కు ఉత్సాహాన్నిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా కేవలం రెండు,మూడు శాతమే అని, 10,15 సీట్ల తేడా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలోనూ గెలుపు ఈజీ అవుతుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. విశ్లేషకులు మాత్రం కర్ణాటక ఎన్నికలు వేరు..ఆరు నెలల తర్వాత జరిగే తెలంగాణ ఎన్నికలు వేరని అంటున్నారు. అక్కడి ఫలితాలు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపవని అంటున్నారు.

ప్రస్తుతం కర్ణాటక బీజేపీ అధికారంలో ఉండగా...ఈసారి కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అగ్రనేతలు కూడా భారీగా ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా కర్ణాటకలో గెలిచి దక్షిణాదిపై పట్టు నిలుపుకోవాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు.ఇక కర్ణాటకలో గెలిచి...తెలంగాణను కొట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది.కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణకు చెందిన నేతలు కూడా ప్రచారానికి వెళ్తున్నారు. పార్టీ మారే నేతలు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.

మరోవైపు జేడీఎస్‌కి మద్దతిస్తున్న బీఆర్‌ఎస్‌ కూడా కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది, అక్కడ ప్రజలు భిన్నమైన తీర్పును ఇస్తారని భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా నివసించే కల్యాణ కర్ణాటకపై JDS ఎక్కువ దృష్టి పెట్టింది.కర్ణాటకలో ప్రచారం కోసం పలువురు తెలంగాణ నేతలరు కాంగ్రెస్, బీజేపీలు మోహరిస్తున్నాయి. స్థానిక నేతలు, ప్రజలతో సత్సంబంధాలు ఉన్న ఇద్దరు నేతలు కర్ణాటకలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.బీజేపీ గెలిస్తే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లోని పలువురు నేతలు కాషాయ పార్టీలోకి మారే అవకాశం ఉందని, ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి గ్రాండ్ ఓల్డ్ పార్టీలోకి చేరికలు ఉండవచ్చనేది విశ్లేషకుల వాదన.

మరో కొన్ని నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి.అలాగే లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి.దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ చేతిలో ఉన్న ఒక్క రాష్ట్రం కూడా చేజారిపోతే.. ఆ ఓటమి ప్రభావం తప్పకుండా తెలంగాణ రాజకీయాల మీద,శాసనసభ ఎన్నికలమీద చాలా ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్నికలలో బీజేపీ ఓడిపోతే, జాతీయ రాజకీయాలలో ప్రవేశించి మోదీప్రభుత్వాన్ని గద్దె దింపాలని తహతహలాడుతున్న కేసీఆర్‌ తన వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉంది. అలాగే మోడీని గద్దె దించేందుకు కాంగ్రెస్‌, మిత్రపక్షాలు కూడా గట్టిగా ప్రయత్నించవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Tags

Next Story