Telangana Congress : యూత్‌డిక్లరేషన్ ప్రకటించనున్న ప్రియాంక గాంధీ

Telangana Congress : యూత్‌డిక్లరేషన్ ప్రకటించనున్న ప్రియాంక గాంధీ

హైదరాబాద్ యువ డిక్లరేషన్ ప్రకటనకు టీ.కాంగ్రెస్ రెడీ అవుతోంది.రేపు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ యూత్‌డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఇక తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రియాంక గాంధీ కి భారీ సంఖ్యలో యువతతో స్వాగతం పలకేలా టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది.ప్రియాంక పాల్గొనే బహిరంగ సభకు కూడా భారీగా జన సమీకరణకు ప్లాన్‌ చేస్తోంది.

ఇక షెడ్యూల్ ప్రకారం ప్రియాంక గాంధీ ఎల్బీనగర్ చౌరస్తా వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి సరూర్‌నగర్ స్టేడియం వరకు టీపీసీసీ నేతలతో కలసి పాదయాత్రగా రావాల్సి ఉంది. కానీ ఆమె టూర్ షెడ్యూల్ టైమింగ్ లో స్వల్ప మార్పులు రావడంతో రోడ్డు మార్గంతో కాకుండా హెలికాప్టర్ లో స్టేడియం వద్దకు చేరుకుంటారు.కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని హైదరాబాద్‌ వస్తున్న ప్రియాంక గాంధీ గంటన్నర మాత్రమే హైదరాబాద్ లో ఉండనున్నారు.

మరోవైపు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్న యువ సంఘర్షణ కార్యాక్రమానికి టీ.కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి సారి ప్రియాంక తెలంగాణకు వస్తున్న నేపధ్యంలో భారీ సంఖ్యలో యువతతో స్వాగతం పలకాలని టీపీసీసీ నిర్ణయించింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువత తరలి రావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు .. హైదరాబాద్ యువ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు. ఇప్పటికే TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ..తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగ కల్పన విషయంలో ఏం చేస్తామో ఈ డిక్లరేషన్ లో వివరించనున్నారు.ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం,మహబూబ్ నగర్ జిల్లాల వారీగా పాదయాత్రలు చేసి కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి యువతతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు టీపీసీసీ నేతలు.


Next Story