వేడి నూనెలో పడిన ఫోన్.. దాంతో బ్యాటరీ పేలి వంట చేస్తున్న వ్యక్తి మృతి

ఏ పని చేస్తున్నా ఫోన్ చెవిలోనో, చేతిలోనో ఉండాల్సిందే.. అంతగా ఫోన్ ప్రతిఒక్కరి జీవితంలో భామైపోయింది. రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కూడా ఫోన్ మాట్లాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనుకుంటే, ఇంట్లో వంట చేస్తూ కూడా ఫోన్ మాట్లాడుతుండే సరికి అది కాస్తా జారి వేడి నూనె పడి బ్యాటరీ పేలింది. దాంతో వంట చేస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రప్రకాష్ అనే యువకుడు వంట చేస్తుండగా తన మొబైల్ ఫోన్ మరుగుతున్న నూనెలో పడి బ్యాటరీ పేలింది. దాంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. శరీరం బాగా కాలిపోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అతడిని హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా అధునాతన వైద్య సంరక్షణను చేరుకోవడంలో ఆలస్యం అయ్యాడు. సకాలంలో చికిత్స అంది ఉంటే బతికే వాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
కుటుంబ సభ్యులు అతన్ని లాహర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. కానీ అతని కాలిన గాయాల తీవ్రత కారణంగా, అతన్ని అధునాతన సంరక్షణ కోసం గ్వాలియర్‌కు రిఫర్ చేశారు. అయితే సింధ్ నదిపై ఉన్న ఇరుకైన వంతెనపై ట్రాఫిక్ రద్దీ కారణంగా చంద్రప్రకాష్ ప్రయాణిస్తున్న అంబులెన్స్ గణనీయంగా ఆలస్యమైంది.
డొంక దారిలో అంబులెన్స్‌కు థారెట్, ఇందర్‌ఘర్, దాబ్రా మీదుగా అదనంగా 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ప్రయాణానికి రెండు గంటలు జోడించడం జరిగింది. తీవ్ర గాయాలపాలైన చంద్రప్రకాష్ మార్గమధ్యంలో మృతి చెందాడు. చంద్రప్రకాష్‌కు భార్య, 14 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వైద్య సహాయం అందడంలో జాప్యంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com