Uttar Pradesh: కూలిన జైనమత వేదిక.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో మంగళవారం జైన నిర్వాణ ఉత్సవంలో వేదిక కూలిపోవడంతో మహిళలు, పిల్లలు సహా ఏడుగురు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. బాగ్‌పత్‌లోని బగౌర్‌లో లడ్డూ వేడుకలో వెదురు మరియు కలపతో చేసిన తాత్కాలిక వేదిక కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జైన సన్యాసుల సమక్షంలో ఆదినాథునికి లడ్డూలు సమర్పించేందుకు వందలాది మంది భక్తులు ఈ ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే, భక్తుల కోసం సిద్ధం చేసిన తాత్కాలిక వేదిక వారి బరువుతో కూలిపోయింది.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు సహా అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
"దాదాపు 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఈసారి వేదిక కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఇరవై మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు" అని బాగ్‌పత్ జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ తెలిపారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, భక్తులకు చికిత్స అందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించ వద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com