కర్నూలులో విషాదం.. కుటుంబం ఆత్మహత్య

అయినవాళ్లంతా కరోనా బారిన పడి కన్నుమూశారు. అవే ఆలోచనలతో జీవితాన్ని గడపలేకపోతున్నాం. మేమూ వారిదగ్గరకే వెళ్లిపోతున్నామంటూ కుటుంబంలోని నలుగురు విషం తాగి మరణించారు. నగరంలోని వడ్డెగేరిలో నివసిస్తున్న టీవీ మెకానిక్ ప్రతాప్ (42)కు భార్య హేమలత (36), పిల్లలు జయంత్ (17), రిషిత (14) ఉన్నారు. బుధవారం ఉదయం ఎవరూ బయటకు రాకపోవడం, తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ఠలికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా నలుగురూ విగతజీవులై కనిపించారు. ఘటనాస్థలి వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ కనిపించింది. దానిలో ఇటీవల కరోనా కారణంగా బంధువులు, స్నేహితులు చనిపోయిన వార్తలు మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఈ కారణంగానే మేము జీవితాన్ని గడపలేకపోతున్నాం.. ఆత్మహత్య చేసుకుంటున్నాం అని రాసి ఉంది. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com