Amla For Winter Diet: శీతాకాలంలో ఆమ్లా జ్యూస్.. అందం, ఆరోగ్యం, ఔషధగుణం..

Amla Benefits (tv5 news.in)
Amla For Winter Diet: నవంబర్ నెల వచ్చిందో రాలేదో అప్పుడే చలి మొదలైంది.. తుమ్ములు, దగ్గులు, సైనస్.. ఒకటేమిటి ఎన్నో ఇబ్బందులు.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమే వీటన్నింటికీ కారణం. పైగా శరీరం కూడా పొడి బారుతుంది. జుట్టు బిరుసుగా ఉంటుంది. చలికి వెచ్చగా రగ్గు కప్పుకుని పడుకున్నంత సేపు బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి ముసుగు తీస్తే ఇబ్బందులు అనేకం. మరి వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే శీతాకాలంలో ఎక్కువగా దొరికే ఆమ్లా (ఉసిరి) ఓ అద్భుతమైన ఔషధం.
అందుకే ఈ సీజన్‌లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి డైట్‌లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి చలికాలంలో ఏం తినాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. తాజా పాలకూర, క్యారెట్, బీట్ రూట్, నారింజ ఇవన్నీ ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో పాటు మరిన్ని ఔషధగుణాలున్న మరో పండు ఉసిరి. ఆమ్లా లేదా ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా ఉసిరిని పిలుస్తారు. ఇది పోషకాలకు ప్రసిద్ధి చెందిన సూపర్‌ఫుడ్. ఉసిరికాయ పురాతన కాలం నుండి సాంప్రదాయ వైద్య పద్ధతిలో ఉపయోగించబడుతుంది.
శీతాకాలపు ఆహారంలో ఆమ్లాను చేర్చేందుకు 5 కారణాలు:
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఉసిరిలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరం లోపల నుండి డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇది సీజనల్ వ్యాధులైన జలుబుతో పోరాడటానికి మరియు రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరచడానికి సహాయపడుతుంది.
2. చర్మ-ఆరోగ్యానికి పోషణ: ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇందులో ఉన్న యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మ నిగారింపుకు తోడ్పడతాయి.
3. బరువు తగ్గించడంలో: శీతాకాలంలో తీసుకునే ఆహారం బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే మీ డైట్‌లో ఆమ్లాను చేర్చుకుంటే బ్యాలెన్స్ అవుతుంది.
4. జీర్ణశక్తిని పెంచుకునేందుకు: చలికాలంలో ప్రజలు ఎదుర్కొనే మరో సమస్య అజీర్ణం. ఉసిరి జీర్ణశక్తిని మెరుగు పరిచి ప్రేగులు ఆరోగ్యంగా ఉండడాన్ని ప్రోత్సహిస్తుంది.
5. మధుమేహ నివారణకు: ఉసిరి క్రోమియం యొక్క గొప్ప మూలం. ఇది ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడానికి మన శరీరానికి సహాయపడుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉసరి తప్పక తీసుకోవాలి. అయితే ఇది మందులకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు అని తెలుసుకోవాలి. తీవ్రతను తగ్గిస్తుంది కానీ పూర్తిగా నివారించబడదు. ఆహారంలో ఉసిరిని చేర్చుకుంటూ వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి.
ఉసిరిని జ్యూస్ రూపంలో, జామ్ రూపంలో, చెట్నీ రూపంలో ఏ విధంగా తీసుకున్నా అందులోని ఔషధ గుణాలు శరీరానికి అందుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com