Benefits of Crying: ఏడవడం వల్ల కూడా ఇన్ని లాభాలు ఉంటాయా..!
Benefits of Crying (tv5news.in)
Benefits of Crying: ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే ఒకటి కాదు.. ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం దానికి కాస్త శ్రమపడాల్సి ఉంటుంది. అయితే కొన్ని సహజంగా జరిగే విషయాలు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. అందులో ఒకటి ఏడవడం. నిజమే.. ఏడవడం కూడా ఆరోగ్య లాభాలు ఉంటాయని నిపుణలు అంటున్నారు.
సరైన ఆహారం, యోగా, వ్యాయామం లాంటివి శరీరానికి ధృడంగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఎవరైనా చేస్తారు. కానీ ఏడవడం అలా కాదు. అది మనకు ఎవరూ నేర్పించరు. అసలు మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది ఏడుపే. బాధ కలిగినా, సంతోషం కలిగినా.. ముందుగా మనిషి కళ్లల్లో కూడా కన్నీరు రావడం సహజం. అయితే దీని వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.
మామూలుగా బాధలో ఉన్నప్పుడు అదంతా ఒక్కసారిగా కన్నీరు రూపంలో బయటికి రావాల్సిందే. ఒకవేళ అలా రాకపోతే మనసు బరువెక్కిపోతుంది. దాని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. ఇది చాలామందికి తెలిసిన విషయమే. కానీ వారిలో ఎక్కువశాతం అందరి ముందు ఏడవడానికి ఇష్టపడరు. ఒంటరిగా కూర్చొని ఏడవడం వల్ల కూడా హార్ట్ ఎటాక్ అవకాశాలు తగ్గిపోతాయి.
చాలామంది బాధను బయటివారితో చెప్పలేక లోపలే కృంగిపోవడం వల్ల డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది అన్నింటికంటే సీరియస్ సమస్య. అయితే అలా జరగకుండా ఉండాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేసి ఆ బాధను బయటికి పంపించేస్తే బెటర్. ఏడవడం వల్ల కలిగే ఈ మానసిక లాభాల గురించి ఎక్కువశాతం మందికి తెలుసు. కానీ దీని వల్ల కొన్ని శారీరిక లాభాలు కూడా ఉన్నాయట.
మనిషి శరీరంలోని సెన్సిటివ్ భాగాల్లో కళ్ళు కూడా ఒకటి. ఈ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక్కటే వీటిని ఇతర సమస్యల నుండి దూరంగా ఉంచడానికి పరిష్కారం. అయితే ఏడవడం వల్ల కళ్లలో డ్రైనెస్ పోతుంది. ఏడవడం వల్ల కళ్ళకు ఎక్కువగా దురద పెట్టే అవకాశం కూడా ఉండదు. అదే కాకుండా కళ్ళు ఎర్రగా అవ్వడాన్ని తగ్గిస్తుంది ఏడుపు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com