Male Fertility: పురుషుల సంతానోత్పత్తిపై COVID-19 ప్రభావం

Male Fertility:ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి ప్రభావం తగ్గింది. దీనికి తోడు ఇప్పుడు కోవిడ్ కూడా మరో కారణమైందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. వ్యక్తుల ఆరోగ్యంపై కరోనా వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.
కరోనా రోగనిరోధక వ్యవస్థపై, శ్వాసకోశ వ్యవస్థలపై తన ప్రతాపాన్ని చూపింది. తాజా అధ్యయనంలో పురుషుల పునరుత్పత్తి వ్యవస్థపై కూడా కోవిడ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడయింది. ఎసిఎస్ ఒమేగా పత్రిక ఈ వివరాలను వెల్లడించింది.
పురుషుల పునరుత్పత్తి అవయవాల్లో కరోనా వైరస్ ఉనికి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు గాను ఐఐటి-బాంబే, ముంబయిలోని జస్ లోక్ ఆస్పత్రి సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించాయి.
పరిశోధనలో భాగంగా కోవిడ్ నుంచి కోలుకున్న 17మందిని, ఇన్‌ఫెక్షన్ సోకని ఆరోగ్యవంతులైన వ్యక్తులను 10మందిని పరీక్షించారు. వీరి వీర్యంలోని ప్రొటీన్ స్థాయిలను విశ్లేషించారు. వీరంతా 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారని తెలిపారు. ఈ పరిశోధనలో ఇన్‌ఫెక్షన్ కారణంగా స్వల్ప మార్పులు కనిపించినా, సంతానోత్పత్తిపై మాత్రం గట్టి దెబ్బ పడిందని కనుగొన్నారు.
కోవిడ్ బాధితులైన మగవారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారు. వాటి చలనశీలత కూడా అంతంతమాత్రమే అని. ఆకారంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. పునరుత్పత్తికి దోహదపడే వీర్యంలోని 27 ప్రొటీన్ల స్థాయిలు పెరగ్గా, 21 ప్రొటీన్ల స్థాయిలు తగ్గాయని చెప్పారు.
ముఖ్యంగా సెమెనోజెలిన్-1, ప్రొసాపోసిన్ ప్రొటీన్ల స్థాయిలు ఉండాల్సిన దానిలో సగం కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఈ పరిశోధనలు మరింత విస్తృతంగా జరగాల్సి ఉందని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com