Cricketer Rishabh Pant Health Bulletin Update : రిషబ్ పంత్ ఆరోగ్యంపై హెల్త్ అప్ డేట్
మ్యాక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్రికెటర్; పంత్ ఆరోగ్య స్థితి నిలకడగానే ఉంది- వైద్యులు; పరీక్షల అనంతరం పూర్తిస్థాయి బులెటిన్ విడుదల
రిషబ్ పంత్ ఆరోగ్యంపై హెల్త్ అప్ డేట్..
టీమిండియా యంగ్ క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ రిషబ్ ఆరోగ్య స్థితి పై వైద్యులు తొలి బులెటిన్ విడుదల చేశారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో పంత్ చికిత్స పొందుతున్నాడు. ఇక ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో రిషబ్ ఉన్నారు. '' ప్రస్తుతం ఆయన కండిషన్ నిలకడగానే ఉందని, మొత్తం పరీక్షలన్నీ ముగిసిన తర్వాత పూర్థిస్థాయి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం'' అని మ్యాక్స్ హాస్పిటల్ తరఫున డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ ప్రకటించారు.
జరిగిన ప్రమాదంలో తలపై గాయాలు, మోకాలి లిగమెంట్ తెగిపోవడం, వీపు భాగంలో కాలడం జరిగిందని వైద్యులు తెలుపుతున్నారు. మరోవైపు పంత్ త్వరగా కోలుకోవాలని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కోరుకుంటున్నట్లు తెలిపాడు. ''రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అదృష్టం కొద్దీ అతడు ప్రాణ ప్రమాదం నుంచి బయటపడ్డాడు'' అని ట్వీట్ చేశాడు.
ఇక రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో అతడు కారు విండో పగలగొట్టుకుని బయటకు దూకేసినట్లు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించగా, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.