ఏంటా ఏడుపు.. ఏడిస్తే మంచిదట మమ్మీ..

నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అంటాడు మనసు కవి ఆత్రేయ. నవ్వీ నవ్వీ కళ్లు తుడుచుకుంటారు మనలో చాలా మంది. అవును కన్నీళ్లకు అంత అద్భుత శక్తి. సంతోషమైనా, దు:ఖమైనా కళ్లలో కనిపించేస్తుంది. ఏ రకంగా ఏడుపు అంటే కళ్లలో నీళ్లు వచ్చినా మంచిదే అంటున్నారు నిపుణులు.
లాఫింగ్ క్లబ్ అనేది నవ్వేందుకు యోగాలో ఓ ప్రక్రియ. మరి ఏడ్చేందుకు కూడా ఏమైనా ఉన్నాయా అంటే.. మనసుకి కించిత్ బాధ కలిగినా సున్నిత హృదయుల కళ్లు త్వరగా వర్షిస్తాయి. అలా వచ్చిన వాటిని ఆపకుండా ఉండడమే మంచిది. మనసు కాస్త కుదుట పడుతుంది. ఎలాగూ వైద్యులు కూడా ఏడవడం మంచిదే అంటున్నారు. మరి ఏడవడం వల్ల లాభాలేంటో చూద్దాం.
ఎక్కువ సమయం దేనిగురించైనా బాధపడుతూ ఏడిస్తే మెదడులో ఉన్న ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదల కావడంతో శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు కలుగుతాయి. దానివల్ల ఏడుపు వస్తుంది.
ఏడవడం వల్ల మెదడు శరీర ఉష్ణోగ్రతలు సంతులితంగా ఉంటాయి. దీంతో మన ఆలోచనల్లో పారదర్శకత కనబడుతుంది. ఏడవడం ద్వారా బిపి కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు.
ఇంకా కన్నీళ్ల ద్వారా కళ్లలో ఉన్న దుమ్ము, మలినాలు పోయి కళ్లు క్లీన్ అవుతాయి.
కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్‌లు.. క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు రక్షణ కల్పిస్తాయి.
కన్నీళ్లు రావడం వలన చెడు ఆలోచనలు దూరమై, మానసిక ప్రశాంతత, మంచి ఆలోచనలు వస్తాయి.
కన్నీళ్లు మూడు రకాలు..
ఒకటి.. బాసల్ టియర్స్ .. ఇవి కళ్లను తేమగా ఉంచడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.
రెండు.. రెప్లెక్స్ టియర్స్.. ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్లలో దుమ్ముధూళి పడినప్పుడు కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
మూడు.. ఎమోషనల్ టియర్స్.. భావోద్వేగాలకు గురైనప్పుడు వచ్చే కన్నీళ్లు.. మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com