అందానికి 'గాడిద' పాలు.. అందుకే లీటర్ 'వెయ్యి' రూపాయలు..!

అందానికి గాడిద పాలు.. అందుకే లీటర్ వెయ్యి రూపాయలు..!
నిజానికి గాడిద పాలు చాలా మంచివని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది.

పాల బుగ్గల పసిడి దానా.. నీ బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా అని అంటే గాడిద పాలు తాగుతూ.. గాడిద పాలతో తయారు చేసిన సబ్బు వాడుతున్నందువల్ల వచ్చిందని వగలు పోతుందేమో వనిత. మరి లేకపోతే లీటరు వెయ్యి రూపాయలు పెట్టి ఎందుకు కొంటారు. నిజానికి గాడిద పాలు చాలా మంచివని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. అందుకే ఆవుపాలు, మేకపాల కంటే గాడిద పాలకే డిమాండ్ ఎక్కువగా ఉందట.

ఈ పాలల్లో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతో స్నానం చేసేవారట. గాడిద పాలతో చర్మం మృదుత్వాన్ని సంతరించుకుని మీ అందం రెట్టింపవుతుందని ఆస్థాన వైద్యులేమైనా సెలవిచ్చారేమో. మరి దీన్ని క్యాష్ చేసుకునే దిశగా ఢిల్లీలోని ఓ స్టార్టప్ కంపెనీ గాడిద పాలతో సబ్బులు తయారు చేసి విక్రయిస్తోంది. ఈ పాలు తరచుగా తీసుకుంటే వృద్ధాప్య చాయలు కూడా త్వరగా దరిచేరవని చెబుతున్నారు.

ఇక ఈ పాలతో తయారు చేసిన సబ్బులకి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటోందని ఆర్గానిక్ సంస్ధ వ్యవస్థాపకురాలు పూజా కౌల్ అంటున్నారు. పాలలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించడంలో, చర్మానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయట. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గాడిద పాల సబ్బులకు డిమాండ్ ఎక్కువ. సబ్బులతో పాటు అక్కడ గాడిద పాలు తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందట.

ఈ క్రమంలోనే గాడిద పాలను లీటర్ వెయ్యి రూపాయలు పెట్టి కొనడానికైనా వెనుకాడ్డం లేదు అక్కడి సౌందర్యాభిలాషులు. ఇంకా లైంగిక సమస్యలతో ఇబ్బందిపడేవారు, ఆస్తమా, ఆర్థరైటిస్, షుగర్ వంటి వ్యాధులకు గాడిదపాలు చక్కని ఔషధం అని అంటున్నారు. అందుకే ఎవర్నీ గాడిద అని తిట్టకండి. గాడిద లేజీ కాదు.. అవసరమైతే బరువులు మోస్తుంది.. ఆరోగ్యంతో పాటు అందాన్నీ ఇస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story