వంటింట్లో ఈగలు, బొద్దింకలు.. సహజ నివారణలతో చెక్..

వంటింట్లో ఈగలు, బొద్దింకలు.. సహజ నివారణలతో చెక్..
ఇల్లంతా నీట్ గా ఉంచుకోవడం ఒక ఎత్తైతే ఒక్క కిచెన్ తోనే మహిళల తల ప్రాణం తోకకి వస్తుంది

ఇల్లంతా నీట్ గా ఉంచుకోవడం ఒక ఎత్తైతే ఒక్క కిచెన్ తోనే మహిళల తల ప్రాణం తోకకి వస్తుంది. తడి పొడి గిన్నెలన్నీ అక్కడే ఉంటాయి. ఇక సింక్ కింద అయితే బొద్దింకలు స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. ఒక్క బొద్దింక కనిపించిందంటే చాలు ఇల్లాలి గుండె ఢమాల్ అంటుంది. వామ్మో వందల్లో పిల్లలు పెట్టేస్తుంది వదిలించుకోవడం ఎట్లా అని ఆందోళన చెందుతుంటుంది. ఇప్పటి వరకు మార్కెట్లో దొరికే రిపిల్లెంట్స్ ఎన్నో ట్రై చేసి ఉంటారు. అదీకాక ఆ వాసనలు కూడా అందరికీ పడవు. అందుకే ఈసారి ఈ సహజ నివారణలు ప్రయత్నించండి. ఒక్కసారి చేసి పోవట్లేదు అనకుండా కొన్ని రోజుల పాటు ప్రతి రోజూ ప్రయత్నించండి..

వంటగదిని సురక్షితంగా ఉంచడానికి 5 సులభమైన మార్గాలు..

వంటగదిలో కీటకాలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది ముందుగా గుర్తించాలి. గిన్నెలన్నీ చిందర వందరగా పెట్టకుండా ఎక్కడివి అక్కడ సర్ధుకోండి. సింక్ లో ఎంగిలి పళ్లాలు, ప్లేట్లు, గిన్నెలు లేకుండా చూసుకోండి. రాత్రి పడుకునేముందు సింక్ లో గిన్నెలన్నీ తీసి ఒక టబ్ లో ఉంచుకోండి..

పాత్రలు, కౌంటర్‌టాప్‌లను శుభ్రం చేయడం, ప్రతిరోజూ చెత్త సంచులను పారవేయడం చాలా ముఖ్యం. కీటకాలకు సంతానోత్పత్తి కేంద్రంగా మారే మీ వంటగదిని ఎప్పుడూ నీట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కిచెన్ పైపులు, క్యాబినెట్‌ల మూలలు శుభ్రపరచడం చాలా అవసరం.

వంటగదిని పరిశుభ్రంగా ఉంచడానికి వారంలో కనీసం ఒకసారి డీప్ క్లీనింగ్ చెయ్యాలి. కానీ మాకు అంత టైమ్ లేదు అంటే ఇలానే కీటకాలు స్థిరనివాసం ఏర్పరచుకుంటాయి. ఇక్కడ 5 సహజ మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. క్యాబినెట్ల మూలల్లో బిర్యానీ ఆకులను ఉంచండి: చెదపురుగులు, ఇతర కీటకాలు మీ వంటగదిలోని ఉడ్ వర్క్ ని పాడు చేయకుండా నిరోధించడానికి బిర్యానీ ఆకులు బాగా పని చేస్తాయి. మీరు చేయాల్సిందల్లా క్యాబినెట్‌ల మూలలో కొన్ని ఆకులను ఉంచడం.

2. వంటగది మూలల్లో దాల్చిన చెక్క పొడిని చల్లండి: దాల్చిన చెక్క సువాసన వంటకం యొక్క రుచిని పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు. ఇది చీమలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. మీ వంటగది మూలల్లో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చల్లడం వలన ఆ సువాసనకు కీటకాలు చనిపోవడానికి లేదా పారిపోవడానికి సహాయపడుతుంది.

3. ఒక గిన్నెలో కొంచెం కాఫీ పొడి ఉంచండి: కాఫీ పొడి వాసన ముక్కుపుటాలను తాగగానే చక్కని కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న గిన్నె తీసుకుని, దానిలో కొంచెం కాఫీ పొడి వేసి వంటగదిలో ఏదైనా మూలలో ఉంచండి.

4. ఆపిల్ సైడర్ వెనిగర్, బేకింగ్ సోడా మరో సహజ నివారిణి: కిచెన్ పైపుల మూలలను శుభ్రం చేయడానికి, ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు కొంచెం బేకింగ్ సోడా కలిపి ఒక ద్రావణాన్ని సిద్ధం చేసి సింక్ దగ్గర ఉంచండి. ద్రావణాన్ని ఒక సీసాలో ఉంచి దాని మూతకు కొన్ని రంద్రాలు చేయండి. ఆ వాసనకు కీటకాలు రావు.

5. ఉల్లిపాయ: బొద్దింకలను తరిమికొట్టడానికి, మీకు సాధారణం కంటే బలమైనది కావాలి. కొంచెం ఉల్లిపాయను కోసి, బేకింగ్ సోడాతో కలపండి. మీ వంటగది మూలల్లో ఈ మిశ్రమాన్ని ఉంచండి.

అన్నిటికంటే ముఖ్యంగా వంట గదిలో తడి లేకుండా పొడిగా ఉండేటట్లు చూసుకోండి. గాలి, వెలుతురు పడుతుంటే కీటకాలు దరి చేరవు. చిన్న గది అయినా శుభ్రంగా ఉంచుకుంటే కీటకాలు వచ్చేందుకు ఆస్కారం ఉండదు.

Tags

Read MoreRead Less
Next Story