Rainy season: వర్షాకాలం వచ్చేసింది.. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.?

Rainy season: వర్షాకాలం వచ్చేసింది.. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.?
Rainy season: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. సరైన డైట్ తీసుకుంటే వాటికి చెక్ పెట్టొచ్చు

వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు ముప్పేట దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ సమయంలో కంటికి కనిపించని సూక్ష్మజీవులు జీవం పోసుకొని విజృంభించడం సహజం. వర్షాలు పడడం స్టార్టయిందంటే చిన్నా పెద్దా అని తేడా లేకుండా జలుబు నుంచి టైఫాయిడ్‌ వరకు ఏదో ఒక అనారోగ్యం కలగడం సర్వసాధారణం. వానాకాలం ఆరంభంతో మారిన వాతావరణంతో ఇమ్యూనిటీ దెబ్బతినడం జరుగుతుంది. దీంతో పలు రకాల వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.


వర్షా కాలంలో కొంత మందికి కాస్త ఉల్లాసంగా ఉంటుంది కానీ..అజాగ్రత్తగా ఉంటే సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోతే.. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు కూడా అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా ఈ వాతావరణంలో మురుగు నీటికి, అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. వ్యాధుల బారిన పడకుండా మంచి ఆహార అలవాట్లను పాటించాలి. ప్రధానంగా బయటి ఆహారాన్ని తినడం మానుకోని ఇంట్లో తయారు చేసిన వేడివేడి ఆహారాన్ని తింటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకోని తినడం వల్ల సీజనల్ వ్యాధులను దాదాపు మీ దరికి చేరకుండా చూసుకోవచ్చు. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మన వంటింట్లో దొరికే దినుసులు, కూరగాయలు చాలా బాగా ఉపయోగపడతాయి.

అల్లం-వెల్లుల్లి

ప్రతి సీజన్‌లో అల్లం-వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండటానికి ఔషధంలా పనిచేస్తాయి. ఇది క్లినికల్‌గా కూడా తేలింది. వర్షాకాలంలో వీటిని తినడం వల్ల రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అయితే వెల్లుల్లి ముఖ్యంగా అంటువ్యాధులతో పోరాడటానికి, మంటను తగ్గించడానికి, ఆక్సీడేటివ్ స్ట్రెస్‎ని తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.


హెర్బల్ టీ, కషాయాలు

వర్షా కాలంలో మీ రోగనిరోధక శక్తిని మరింత శక్తివంతంగా మెరుగుపర్చుకోవడానికి హెర్బల్ టీ లేదా కషాయాలను క్రమం తప్పకుండా తాగాలి. దీనికోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, నల్ల ఉప్పును మంచి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసం, తేనె కలుపుకోని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు.


ఆకు కూరలు, ఇతర జాగ్రత్తలు:

పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి దోహదపడతాయి. ఆకు కూరలు తినడం వల్ల తరచూ అనారోగ్యానికి గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో సలాడ్లు తీసుకోవడం మానేయాలి. అలాగే చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారపదార్థాలను తీసుకోకపోవడం మంచింది. ఈకాలంలో ఎక్కువగా నీరు కలుషితం కావడం వల్ల చేపలు రొయ్యలను తీసుకోవడంతో ఆ ప్రభావం మనపై చూపుతుంది. అందువల్ల ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. ఇక దాహం లేకున్నా వీలయినంత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. అదికూడా ఫిల్టర్‌ చేసిన లేదా కాచి చల్లార్చిన నీళ్లను తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం. బాగా ఉడికించిన ఆహారాన్ని, వేడిగా ఉన్నప్పుడే తీసుకోవడంతో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story