Coffee Seeds: కాఫీ గింజలతో కురులకు అందం.. జుట్టు ఆరోగ్యం కోసం హెయిర్ మాస్క్..

Coffee Seeds: కాఫీతో తయారుచేసిన ఈ హోంమేడ్ హెయిర్ మాస్క్‌లు జుట్టు అందాన్ని పెంచుతుంది.. ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉదయాన్నే వేడి వేడిగా ఓ కప్పు కాఫీ తాగితే ఎంత బావుంటుంది. బద్ధకం వదిలి పోతుంది. మైండ్ బాగా పనిచేస్తుంది. ఘుమ ఘుమలాడే ఆ కాఫీ సువాసనలు జుట్టుకీ అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయని చెబుతున్నారు బ్యూటీషియన్లు. కాఫీ పౌడర్ తో తయారు చేసిన హెయిర్ మాస్క్ వారానికి ఒకసారి అప్లై చేయడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు పట్టు కుచ్చులా మెరుస్తుంది. ఇది జుట్టుకు మంచి కండిషనర్ మాదిరిగా పనిచేస్తుంది. కాఫీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
కాఫీ మాస్క్ తయారీ విధానం..
* ఓ చిన్న గిన్నెలో 2 కప్పుల కొబ్బరి నూనె తీసుకుని వేడి చేయాలి. ఇప్పుడు దానికి 1/4 కప్పు కాల్చిన కాఫీ గింజలను వేసి, కాసేపు మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి. పది నిమిషాల తరువాత స్టౌ ఆఫ్ చేసి నూనెను వడకట్టాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలో భద్రపరచాలి. తల స్నానం చేసే ముందు ఈ నూనెతో తలకు మసాజ్ చేసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి.
మీరు దీన్ని మరో పద్దతిలో కూడా చేయవచ్చు. ఇందుకోసం, 1 tsp కాఫీ పొడి, 2 tsp ఆముదం తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్ల నుంచి చివరి వరకు పట్టించాలి. ఓ అరగంట అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూతో జుట్టును వాష్ చేయాలి.
చుండ్రుని నివారించడానికి కనీసం వారానికి ఒకసారి ఈ మాస్క్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
కాఫీలోని కెఫిన్ హెయిర్ ఫోలికల్‌ను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఆముదం జుట్టుకి మెరుపునీ, అలాగే పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కొబ్బరి నూనె జుట్టుని స్మూత్ చేస్తుంది.
క్రమం తప్పకుండా మాస్క్ ని ఉపయోగించినప్పుడు మీ జుట్టు యొక్క కుదుళ్లు గట్టిపడతాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com