Home Remedies to cure Dandruff : చుండ్రు సమస్యని నివారించే ఇంటి చిట్కాలు..

Health & Life Style
Home Remedies to cure Dandruff: అసలే ఈ పొల్యూషన్‌కి జుట్టంతా ఊడుతోందని బాధ పడుతుంటే మళ్లీ ఈ చుండ్రు ఒకటి. ఉన్న నాలుగు వెంట్రుకలు కూడా ఊడేలా ఉన్నాయి. పైగా ఒకటే దురద అని వాపోతుంటారు చుండ్రుతో బాధ పడే వాళ్లు. మార్కెట్లో ఉన్న డాండ్రఫ్ ఫ్రీ షాంపూలు వాడినా ఫలితం కనిపించట్లేదని ఆందోళన చెందుతుంటారు. అవి ఇవీ వాడే బదులు ఇంట్లోనే దొరికే పదార్థాలతో చుండ్రును తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. మంచి ఆహారపు అలవాట్లతో జుట్టుకి కావలసిన పోషణను అందించడం అన్ని విధాల శ్రేయస్కరమని అంటున్నారు నిపుణులు.
చుండ్రు ఒక వైద్య సమస్య, ఇది ప్రపంచవ్యాప్తంగా సగం మంది జనాభా చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. లింగ బేధం, వయస్సు తారతమ్యాలు లేకుండా అందరినీ వేధించే సమస్య.
చుండ్రు మలాసెజియా అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఇది సెబమ్ (తలలో ఉన్నసేబాషియస్ గ్రంధుల ద్వారా స్రవిస్తుంది) ఈ సూక్ష్మజీవి నెత్తిమీద ఒక సాధారణ భాగం అయినప్పటికీ సమస్యాత్మకంగా మారినప్పుడు ఫంగస్ చేరి ఇబ్బంది పెడుతుంది. దీంతో వెంట్రుకలు పొడిబారడంతో పాటు దురద రావడానికి కూడా ఇది కారణం. చుండ్రును అరికట్టేందుకు ఇంటి చిట్కాలు సహాయం చేస్తాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
కొన్ని సహజమైన ఇంటి నివారణలు ఇక్కడ ఉన్నాయి:
1. జుట్టుకు నూనె పట్టిస్తున్నారా..
ఢిల్లీకి చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ దీపాలి భరద్వాజ్.. నూనె.. చుండ్రును మరింత పెంచుతుందని చెప్పారు. ఎందుకంటే ఆయిల్ అనేది మాలాజీసియాకు ఆహారం లాంటిది. పొడి జుట్టుకు నూనె రాసుకోకపోతే మరింత పొడిగా మారుతుందని అనిపించవచ్చు. కాని ఇది చుండ్రు తీవ్రతను మరింత జఠిలం చేస్తుంది.
2. వెనిగర్
వెనిగర్ దురద, పొడి చర్మానికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. చుండ్రును కలిగించే ఫంగస్ మరియు బ్యాక్టీరియాను చంపడానికి కూడా ఇది సహాయపడుతుంది. వెనిగర్ యొక్క ఆమ్ల కంటెంట్ చుండ్రు తీవ్రతను తగ్గించడానికి చాలా ప్రయోజనకరంగా పని చేస్తుంది. డాక్టర్ దీపాలి సలహా ప్రకారం తల స్నానం చేయడం పూర్తయిన తరువాత వెనిగర్ కొద్దిగా చేతిలోకి తీసుకుని వెంట్రుకలకు పట్టించాలి. ఓ 5 నిమిషాలు ఉంచి కడిగేస్తే సరిపోతుంది.
3. బేకింగ్ సోడా
మీరు వాడే షాంపూలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తలకు పట్టించి రుద్దుకుంటే చుండ్రు తీవ్రత తగ్గుతుంది. చుండ్రు తాలూకు వచ్చే దురదను కూడా నివారిస్తుంది.
4. వేప
యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల వేప దాదాపు అన్ని చర్మ సంబంధింత మందులలో కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. డాక్టర్ శిరీషా సింగ్ నివేదిక ప్రకారం వేప నూనె తలకు పట్టించి కొద్ది సేపు ఉంచుకుని షాంపూ చేసుకుంటే చుండ్రు తగ్గుముఖం పడుతుంది అని తెలిపారు.
5. టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ ఫంగల్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. మీ షాంపూలో ఒకటి లేదా రెండు టీ ట్రీ ఆయిల్ చుక్కలు వేసి షాంపూ చేసుకున్న తరువాత జుట్టుని కడగాలి.
6. వెల్లుల్లి
యాంటీ ఫంగల్ సహజ ఉత్పత్తిగా వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించాలి. దీనికి కొద్దిగా తేనె కూడా జత చేయవచ్చు.
7. కలబంద
ఇప్పుడు ప్రతి ఇంట్లో కలబంద దర్శనమిస్తుంది. వాస్తుకి, సౌందర్యానికి, ఆరోగ్యానికి కలబంద ఉపయోగపడుతుంది. చర్మాన్ని తేలికగా ఉంచుతుంది. యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కలబంద మొక్క నుండి గుజ్జుని నేరుగా తీసి తలకు పట్టించడం ఉత్తమం. అనంతరం షాంపూతో కడిగేస్తే చుండ్రు తాలూకు చికాకు తొలగిపోతుంది. దీన్ని వారానికి ఒకసారి పెట్టినా మంచిదే. వెంట్రుకలు కూడా స్మూత్‌గా సిల్కీగా మారతాయని డాక్టర్ శిరీషా సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com