ఆకలి లేదు.. అన్నం వద్దని చిన్నారులు మారాం చేస్తుంటే..

ఆకలి లేదు.. అన్నం వద్దని చిన్నారులు మారాం చేస్తుంటే..
స్కూలుకి పెట్టిన లంచ్ బాక్స్ కనీసం మూతైనా తెరవకుండా ఇంటికి తీసుకు వచ్చేస్తుంటారు పిల్లలు అదేమంటే ఆకలి లేదు అంటారు.

స్కూలుకి పెట్టిన లంచ్ బాక్స్ కనీసం మూతైనా తెరవకుండా ఇంటికి తీసుకు వచ్చేస్తుంటారు పిల్లలు అదేమంటే ఆకలి లేదు అంటారు. ఇంట్లో అమ్మ బలవంతంగా పెట్టినా కొంచెం తిని.. ఇంక వద్దు.. పొట్టనొప్పి వస్తుంది ఇలా ఏవో కారణాలు చెబుతుంటారు. ఎన్ని మందులు వాడినా వేసుకున్నన్ని రోజులు బానే ఉంటారు. మళ్లీ యధామామూలే. మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా అంటే.. ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే చిన్న చిన్న చిట్కాలు రోజూ పాటిస్తుంటే వారికి బాగా ఆకలి అవుతుంది. అమ్మ పెట్టిన ప్రతిదీ అమృతంలా అనిపిస్తుంది. అవేంటో ఓసారి చూద్దాం..

నిమ్మరసం: ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు చాలా మంచిది. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ని నివారిస్తుంది. దాంతో ఆకలిగా అనిపించి ఏదైనా తినాలనే కోరిక పెరుగుతుంది. అందుకు ఓ గ్లాస్ నీటిలో నిమ్మరసం పిండి, కొద్దిగా ఉప్పు లేదా తేనె కలిపి ఉదయాన్నే తీసుకోవాలి.

అల్లం: అజీర్తిని, వికారాన్ని నివారించడంలో అల్లం చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. అందుకే ఆకలిని పెంచడంలో అల్లం మంచి హోం రెమిడీ. వంటల్లో వేయడం, అల్లం టీ తాగడం వంటివి చేయాలి. అల్లం మురబ్బాని పిల్లలకి రోజూ కొంచెం పెడుతుంటే తియ్యగా ఉండి తినడానికి వీలుగా ఉంటుంది. దాంతో ఆకలి కూడా పెరుగుతుంది. (అల్లం మురబ్బా తయారీకి అల్లం తురుము, సరిపడినంత పటిక బెల్లం పొడి కలిపి స్టౌ మీద పెట్టి నీరంతా పోయేదాకా ఉంచాలి. ఆ తరువాత దించి చల్లారాక చిన్న చిన్న బాల్స్‌లా తయారు చేసి రోజూ ఒకటి, రెండు చిన్నారులకు తినిపించండి).

ఖర్జూరం: ఆకలి పెంచే మరో పదార్థం. వీటిని అలానే తినేయొచ్చు. రోజూ 4,5 తిన్నా మంచిదే.

దాల్చిన చెక్క: పొడి చేసుకుని వంటల్లో కొద్దిగా వేస్తుంటే రుచీ బావుంటుంది. ఆకలీ అవుతుంది. ఒక పావు స్పూను పొడికి స్పూన్ తేనె కలిపి తీసుకున్నా మంచిది.

చింతపండు: చింతపండు రసం రెండు మూడు రోజులకు ఒకసారి పెట్టి అన్నంలో కలిపి పెట్టండి. ఆకలి బాగా అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మెంతులు: కడుపు ఉబ్బరాన్ని మెంతులు నివారిస్తాయి. స్పూన్ మెంతి పొడిని నేరుగా తీసుకోవచ్చు లేదా వంటల్లో వేయొచ్చు. అయితే వంటల్లో వేసేటప్పుడు పావు చెంచా వేస్తే సరిపోతుంది. ఎక్కువైతే చేదు వస్తుంది.

కొత్తిమీర, పుదీనాలను తరచూ తీసుకోవడం వలన ఆకలి బాగా పెరుగుతుంది.

వెల్లుల్లి: ఉడికించిన వెల్లుల్లి తిన్నా ఆకలి పెరుగుతుంది.

యాలుకులు: రోజూ భోజనం చేసే ముందు 2,3 యాలుకలు తింటే ఆకలి బ్రహ్మాండంగా అవుతుందంటున్నారు.

దానిమ్మ: దానిమ్మ గింజలు కానీ, జ్యూస్ కానీ పిల్లలకు రోజూ ఇస్తే మంచిది. పై వాటిలో రోజూ ఏదో ఒకటి ఇస్తుంటే అమ్మా ఆకలి అంటూ మీ కొంగు పట్టుకు తిరిగేస్తారు. మరెందుకాలస్యం.

Tags

Read MoreRead Less
Next Story