ఐస్‌క్యూబ్స్‌తో అందం..

ముఖారవిందాన్ని ఇనుమడింపజేసే సౌందర్యసాదనాలెన్ని ఉన్నా ఫ్రిజ్‌లో ఉన్న ఐస్ క్యూబ్స్‌తో ప్రతి రోజూ ముఖంపై రుద్దుకుంటే చర్మ రంద్రాలు శుభ్రపడతాయని సౌందర్య నిపుణులు సెలవిస్తున్నారు. సూర్యరశ్మి, వాయు కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇవన్నీ ఒత్తిడిని పెంచుతాయి. ముఖం మీద మొటిమల, ముడతలు, స్కిన్ గ్లో లేకపోవడం వంటి వన్నీ చర్మ సమస్యలకు దారి తీస్తాయి. కళ్ల కింద నల్లటి వలయాలు, కంటి కింద వాపు ఇవన్నీ మీ ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి.
ఢిల్లీకి చెందిన చర్మ సంరక్షణ వైద్యురాలు డాక్టర్ గీతిక మిట్టల్ గుప్తా ముఖ సౌదర్య సాధనమైన ఐస్‌క్యూబ్స్ గురించి ఇలా వివరిస్తారు.
1. ఇది మీ ముఖం మీద కనిపించే అలసటను తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, మీ చర్మం యొక్క రంగును ప్రకాశవంతం చేస్తుంది. తద్వారా చర్మం తక్షణ మెరుపును సంతరించుకుంటుంది.
2. ఇది మొటిమలను ఉపశమనం చేస్తుంది
మొటిమలపై ఐస్‌క్యూబ్ ఉంచడం వాడటం వల్ల రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
3. మీ ముఖం మీద ఐస్ ని క్రమం తప్పకుండా రుద్దడం ద్వారా వాపు తగ్గుతుంది.
4. ఇది వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
ఐస్‌క్యూబ్ చల్లదనం మీ చర్మం యొక్క రంధ్రాలను బిగుతుగా ఉంచడానికి సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాల రూపాన్ని పరిమితం చేస్తుంది.
5. ఇది వడదెబ్బ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
వడదెబ్బ తగిలి చర్మం కందిపోతుంది. అలాంటి సమయంలో ఐస్‌క్యూబ్స్‌తో రబ్ చేయడం వలన కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది.
ముఖంపై ఐసింగ్ ఎలా చేయాలి..
మీరు కొన్ని ఐస్ క్యూబ్స్‌ను పల్చటి క్లాత్ లేదా రుమాలులో చుట్టి మీ ముఖం మీద రబ్ చేయవచ్చు. ఐస్ ట్రేలో నీళ్లకు బదులు అప్పుడప్పుడు టొమాటో గుజ్జు, కలబంద రసం, దోసకాయ రసం వంటి పదార్ధాలను ఉంచి వాటితో రబ్ చేయడం వలన మీ చర్మానికి అదనంగా పోషకాలు అందుతాయి. అయితే రోజుకు ఒకసారి మాత్రమే ఐస్ క్యూబ్‌తో ముఖాన్ని రుద్దాలి. అంతకంటే ఎక్కువ సార్లు రుద్దితే సున్నితమైన మీ ముఖ చర్మం మొరటుగా మారుతుంది.
గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం నేరుగా ముఖానికి ఐస్ క్యూబ్స్ అప్లై చేయవద్దు. ఒక టవల్ లేదా కోల్డ్ కంప్రెస్ బాగా పనిచేస్తుంది. మీ ముఖం యొక్క ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఐస్ ప్యాక్ లేదా క్యూబ్‌ను ఒక నిమిషం కన్నా ఎక్కువ ఉంచవద్దు. మీ కళ్ళ చుట్టూ ఐస్ క్యూబ్స్ ఉంచినప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ప్రత్యేకించి వాటిలో ఏదైనా ప్రత్యేకమైన పదార్థాలు ఉంటే కళ్లు ఇబ్బందికి గురవుతాయి. ఇది చాలా సున్నితమైన ప్రాంతం కాబట్టి కళ్ళ క్రింద గట్టిగా రుద్దకూడదు. మంచి ఫలితాల కోసం ఎప్పుడూ చిన్న సర్కిల్స్ మాదిరిగా ఐస్ క్యూబ్స్‌తో రుద్దండి. ఇలా చేస్తున్నప్పుడు మీకు మంట లేదా మరేదైనా అసౌకర్యం అనిపిస్తే, వెంటనే ఆపేసి, అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com