Bread: ఖాళీ కడుపుతో బ్రెడ్.. రోజూ అదే బ్రేక్‌ఫాస్ట్.. ఆరోగ్యానికి..

Bread: ఇడ్లీ తినమంటే బోర్.. పోనీ దోశ చేస్తే అంత క్రిస్పీగా లేదని దానిక్కూడా పేర్లు.. బ్రెడ్ అయితే జామ్ కానీ, ఛీజ్ స్లైస్‌లు కానీ పెట్టుకుని ఓ రెండు ముక్కలు తినేస్తే ఆ పూటకి బ్రేక్‌ఫాస్ట్ అయి పోతుంది.. ఇది నేటి కాలం యువత చేసేపని. అప్పుడప్పుడు పర్లేదు కానీ రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తింటానంటే మాత్రం కట్టడి చేయాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు.
మీకు ఇష్టమైన ఆహారాలలో బ్రెడ్ ఒకటిగా ఉండడంలో ఆశ్చర్యంలేదు. ఫ్రిజ్‌లో ఉంటుంది. ఆకలిగా అనిపించినప్పుడల్లా లేదా అమ్మ చేసిన బ్రేక్‌ఫాస్ట్ నచ్చకపోతేనో అదే గతి. అయితే రోజూ అదే పనిగా బ్రెడ్ తింటే అది మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీరు తెలుసుకోవాలి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
పిజ్జా, బేగెల్స్, మఫిన్లు మొదలైన బ్రెడ్ మరియు గోధుమ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటారా? బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే, బ్రెడ్‌లో కేలరీలు ఎక్కువ మరియు పోషకాలు తక్కువగా ఉంటాయి.
ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం మంచిది కాదు. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. నిద్రలేచిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఆహారం తినకూడదు.
ఖాళీ కడుపుతో రొట్టెలు తినడం ఆరోగ్యానికి మంచిదా, చెడ్డదా?
వైట్ బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ప్రత్యేకంగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న ఆహారాలు ఆకలిని పెంచుతాయి. అతిగా తినడాన్ని ప్రోత్సహిస్తాయి, తద్వారా, అధిక బరువు లేదా ఊబకాయంతో ఇబ్బంది పడతారు.
ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. బ్రెడ్‌లో ఉండే సాధారణ పిండి పదార్థాలు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. ప్రేగు కదలికలు బాధాకరంగా ఉంటాయి. కాబట్టి, ఉదయాన్నే బ్రెడ్ తినకపోవడమే మంచిది. ముందుగా ఏదైనా తేలికగా తీసుకోండి.
బ్రెడ్ కడుపు ఉబ్బరం కలిగిస్తుంది. వైట్ బ్రెడ్‌లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సులువుగా జీర్ణమయ్యే పల్చని గోధుమ రొట్టెలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com