Eggs: వేసవిలో గుడ్డు తినడం మంచిదా.. కాదా! ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..

Eggs: వేసవిలో గుడ్డు తినడం మంచిదా.. కాదా! ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..
Eggs: గుడ్డులో హెచ్‌డిఎల్-హై-డెన్సిటీ లిపోప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.

Eggs: అమ్మ చేసిన బ్రేక్ ఫాస్ట్ నచ్చకపోతే ఆమ్లెట్ వేసుకుని తినొచ్చు. ఆఫీస్ కి టైమ్ అవుతుంటే ఓ బాయిల్డ్ ఎగ్ తిని పరిగెట్టేయొచ్చు.. హెవీ టిఫిన్స్ కంటే ఎంతో మేలు కదా అని గుడ్డు తినడానికి ఆసక్తి చూపుతుంటారు చాలా మంది.. మరి ఇది ఎండలు మండుతోన్న వేసవి కాలం.. ఈ సమయంలో గుడ్డు తినొచ్చో లేదో అని చాలా మందికి డౌట్.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బ్రెడ్ ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్డు, కోడిగుడ్డు కూర తినడం ఎవరికి ఇష్టం ఉండదు? ఈ రుచికరమైన వంటకాలు గుడ్డు ప్రేమికులందరికీ ఇష్టమైన అల్పాహారం. అంతే కాదు గుడ్లు చవకధరలో లభ్యమవడంతో పాటు అధికంగా ప్రోటీన్ ఉంటుంది. అందుకే గుడ్డుని సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు.

విటమిన్ డి, బి, జింక్, కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల అవి అత్యంత బలవర్ధకమైన పోషకాహారం. అంతేకాకుండా, గుడ్డులో ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహించే సల్ఫర్, అమైనో ఆమ్లాల అధిక కంటెంట్ కారణంగా జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్డులో హెచ్‌డిఎల్-హై-డెన్సిటీ లిపోప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.

ఇక వేసవిలో గుడ్లు తినకూడదని అంటారు చాలా మంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీని వెనుక ఎటువంటి శాస్త్రీయ నిజం లేదు. వేసవిలో గుడ్లకు దూరంగా ఉండాలనేది అపోహ మాత్రమే. కొన్ని ఆహారాలు శరీరానికి చలవనిచ్చేవి వుంటే, మరికొన్ని వేడిగా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, దేన్నైనా మితంగా తీసుకోవడం.


ఎంత మోతాదులో తీసుకోవాలి?

గుడ్లు శరీరానికి వేడినిచ్చేవే. కానీ వాటిలో చాలా పోషకాలు ఉంటాయి. వేసవిలో వాటిని పూర్తిగా మానేయడం మంచిది కాదు. మితంగా తీసుకోవచ్చు. వేసవిలో రోజుకు ఒకటి లేదా 2 గుడ్లు తినమని సలహా ఇస్తారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది, ప్రేగు కదలికల్లో సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, గుడ్లు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తాయి.

ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే వేసవిలో సహజంగానే ఆకలి ఎక్కువ అవుతుంది. ఎండ వేడిమికి శరీరానికి చమట పడుతుంది.. దాంతో త్వరగా నీరసం వచ్చి ఆకలి అనిపిస్తుంది.. ఏమైనా తినాలని అనిపిస్తుంది.. గుడ్డు తింటే పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.. ఆకలి తగ్గుతుంది.

గుడ్డు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

గుడ్డులోని ఐరన్ ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ముఖ్యమైనది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇంకా, గుడ్డులో విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కాల్షియంను గ్రహించేందుకు చాలా అవసరం. గుడ్లలో ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కంటిశుక్లం, అంధత్వం వంటి రుగ్మతల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

నిస్సందేహంగా, మీరు వేసవిలో గుడ్లు తినవచ్చు కానీ రోజుకు 1-2 గుడ్లు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఒంట్లో వేడి లేకుండా ఉండేందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్ లో దొరికే తర్భూజా, కర్భూజా వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు బదులు పల్చటి మజ్జిగ ఎక్కువగా తీసుకుంటే గుడ్డు తిన్నా వేడి చేయదు. గుడ్డు తినడం వల్ల వచ్చే లాభాలను మీ శరీరం స్వీకరిస్తుంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇంటర్నెట్ లో పొందు పరిచిన సమాచారాన్ని వివరించాము. వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story