జీరా గోలీ.. ప్రతి రోజు భోజనం తరువాత తీసుకుంటే..

జీలకర్ర, ప్రతి భారతీయ వంటగదిలో లభించే ఒక అద్భుతమైన మసాలా. మీ వంటకాలకు సువాసనను జోడించడమే కాకుండా రుచిని కూడా పంచుతుంది.
జీలకర్ర అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, ముఖ్యంగా జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే కాస్త జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి వేడి నీళ్లు తాగమంటారు. దాంతో తక్షణ ఉపశమనం లభిస్తుంది.
జీలకర్ర జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించగల సమ్మేళనాలను కలిగి ఉంది, ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఫైబర్, ఇనుము, జింక్, రాగి, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండిన జీలకర్ర జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు జీలకర్ర నీటిని తాగుతారు. జీలకర్ర నీరు బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
జీరా గోలీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం చాలు సులభం కూడా.. దీనికి కావలసిన పదార్ధాలు.. జీలకర్ర, నల్ల మిరియాలు, రాళ్ల ఉప్పు, నల్ల ఉప్పు, నిమ్మరసం, ఇంగువ, యాలకుల పొడి, చక్కెర పౌడర్ అవసరం. ఈ డైజెస్టివ్ గోలీలను తయారు చేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవచ్చు. మెరుగైన జీర్ణక్రియ కోసం ప్రతి రోజు భోజనానంతరం ఒకటి తీసుకోవచ్చు. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. గ్యాస్ సమస్యలు ఉండవు.
జీర గోలీ తయారీ: ముందుగా జీలకర్రను సన్నని మంట మీద వేయించుకోవాలి. ఈ ప్రక్రియ గింజలలో ఉన్న తేమను తొలగిస్తుంది. తర్వాత వాటిని చల్లార్చి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ జీలకర్ర పొడికి, నల్ల మిరియాల పొడి, రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, యాలకుల పొడి, ఇంగువ, చక్కెర పౌడర్ వేసి ఒక గిన్నెలో కలపాలి. ఈ పదార్థాలన్నీ బాగా కలిసిని తరువాత ఆ మిశ్రమానికి నిమ్మరసం జోడించాలి. అనంతరం వాటిని చిన్న చిన్న గోలీల మాదిరిగా చేసుకోవాలి. వీటిని మళ్లీ చక్కెర పౌడర్ లో దొర్లిస్తే చూడడానికి, తినడానికి బావుంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com