World Hepatitis Day: హెపటైటిస్ ప్రాణాంతకమా..?

Hepatitis Day: ప్రపంచంలో ప్రతి 30 సెకండ్లకు ఒకరు హెపటైటిస్ లేదా హెపటైటిస్ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారంటే మీరు నమ్ముతారా..? కానీ ఇది నమ్మలేని నిజం. లివర్ సంబంధిత హెపటైటిస్ బారీన పడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. మరి కొంతమందికి అది తమకు వచ్చిందనే విషయం కూడా తెలియడం లేదు. ఇది విస్తరిస్తూ ప్రాణాంతకం కావడంతో దీనిపై అవగాహన కల్పించడానికి ప్రతీ సంవత్సరం జులై 28న ప్రపంచ హెపటైటిస్ రోజుగా జరుపుకుంటున్నారు. 2023 సంవత్సరంలో "ఒకే జీవితం, ఒకే లివర్" అనే థీమ్‌తో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు.
హెపటైటిస్‌పై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈరోజు ముఖ్య ఉద్ధేశం. హెపటైటిస్‌లో వైరస్ లక్షణాలు బట్టి A, B, C, D, E అనే రకాలు ఉన్నాయి. ఈ వ్యాధి వల్ల వచ్చే ప్రభావాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. 2030 సంవత్సరం వరకు హెపటైటిస్‌ని సమూలంగా నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. WHO గణాంకాల ప్రకారం సుమారు 35.4 కోట్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ B, C లతో జీవిస్తున్నారు.
దీనిని మొదట్లోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు అని వైద్యులు వెల్లడిస్తున్నారు. బాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులను యాంటీ బయాటిక్స్‌తో నయం చేసే వీలు ఉంది. కానీ వైరస్ ద్వారా వ్యాపించే హెపటైటిస్ A, B, C, D, E లను వాటి ద్వారా తగ్గించలేం. B, C రకం వైరస్ సోకినా లక్షణాలు బయటకు కనిపించకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇది చాలా రోజులపాటు లక్షణాలు కనిపించకుండా ఉంటూ, లివర్ సామర్థ్యాన్ని క్రమంగా క్షీణింపజేస్తుంది.
హెపటైటిస్‌పై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. వాటికి వైద్యులు ఇస్తున్న వివరణలు ఇవే..
హెపటైటిస్ కేవలం వైరస్ ద్వారానే వస్తుంది..
హెపటైటిస్ కేవలం వైరస్ ద్వారా మాత్రమే కాకుండా మితిమీరిన మద్యపానం, కొన్ని రకాల చికిత్సలు, విష పదార్థాలు, ఆటో ఇమ్యూన్ పరిస్థితుల ద్వారా కూడా ఇది రావచ్చు.
హెపటైటిస్ అంత ఆందోళన కలిగించేది కాదు..
ఈ వ్యాధి అంత ప్రాణాంతకంగా చాలా మంది భావించరు. కేవలం చిన్న సమస్యగా భావిస్తుంటారు. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కోల్పోతారు. ఇది ఎక్కువగా కలుషిత ఆహారం, నీటి ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. వ్యాక్సినేషన్, పరిశుభ్రత పాటించడం ద్వారా కొంత వరకు నివారించవచ్చు.
డ్రగ్స్, అసురక్షిత సెక్స్ చేసే వారికే ఇది సోకుతుంది..
ఒకసారి వినియోగించిన సూదులను మళ్లీ మళ్లీ ఉపయోగించడం, అసురక్షిత సెక్స్‌లో పాల్గొనడం వల్ల హెపటైటిస్ బి, సి సంక్రమించే ప్రమాదాన్ని పెంచుతుందనేది నిజమే. ఈ వైరస్‌లు కలుషిత రక్తంతో రక్తమార్పిడి చేయడం, స్టెరిలైజ్ చేయని వైద్య పరికరాల వాడకం, ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకు కూడా సోకవచ్చు.
హెపటైటిస్ వ్యాక్సిన్ పెద్దలకు అవసరం లేదు...
హెపటైటిస్ వ్యాక్సిన్స్ కేవలం చిన్న పిల్లల్లో రాకుండానే వేస్తారనే అపోహ కూడా ఉంది. కానీ పెద్ద వయస్కులు కూడా వ్యాక్సిన్ల ద్వారా A, B రకాలు రాకుండా అడ్డుకోవచ్చు.
హెపటైటిస్‌కు చికిత్స లేదు..
లివర్ పనితీరుపై ప్రభావం చూపినప్పటికీ, సరైన సమయంలో గుర్తించి, చికిత్స చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి విస్తరించకుండా ఆపవచ్చు. మెడికల్ రంగంలో వచ్చిన పురోగతి నేపథ్యంలో ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే వీలు కూడా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com