Baldness Solution: బట్టతలపై జుట్టు రప్పించవచ్చట.. ఆ ప్రోటీన్ ఏంటో తెలిసిపోయింది..

Baldness Solution (tv5news.in)
Baldness Solution: ఎంత కాదనుకున్న పైకి కనిపించేదే అందం అని మనలో చాలామంది ధృడంగా నమ్ముతారు. అందుకే నేచురల్‌గా వచ్చిన బ్యూటీని కాదని దానిపైన ఆర్టిఫీషియల్ ప్రయోగాలను చేస్తుంటారు. ఈ మధ్య బ్యూటీ విషయంలో కూడా చాలామంది చాలా సమస్యలనే ఎదుర్కుంటున్నారు. అందులో ఒకటి బట్టతల. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య చాలామందిని వెంటాడుతున్న సమస్య ఇది. కానీ ఈ సమస్యను తీర్చే పర్మనెంట్ సరిష్కారాన్ని కనుక్కున్నారట వైద్యులు.
బట్టతల ఉన్నవారు పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. చిన్న వయసులోనే బట్టతల రావడం వారి ఆత్మవిశ్వాసంపైన ప్రభావం చూపిస్తుందని వారు అంటున్నారు. అందుకే దీనిని పెద్ద సమస్యగా భావించి హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు దీని పరిష్కారం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లకు వారి ప్రయత్నానికి సత్ఫలితం దొరికినట్టుగా కనిపిస్తోంది.
ఎన్నో ఏళ్లుగా బట్టతలకు పరిష్కారం కోసం ఎలుకలపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఒక ప్రొటీన్ లోపం వల్ల బట్టతల వస్తుందని కనుక్కున్నారు. ఒత్తిడి కలిగించే కార్టిసోల్ వంటి హార్మోన్ల కారణంగా ఆ ప్రోటీన్ లోపం వస్తుందట. దీనివల్లే ఫోలికల్స్ (వెంట్రుకల కుదుళ్లు) దెబ్బతింటున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఆ ప్రొటీన్‌ను తిరిగి సరఫరా చేయగలిగితే.. అదే దీనికి పరిష్కారం అంటున్నారు. జుట్టు పెరుగుదలకు సహకరించే ప్రోటీన్ ను GAS6 గా గుర్తించారు పరిశోధకులు.
అసలు ఈ బట్టతల అనేది ఎందుకు వస్తుంది అనేది కూడా ఇంకా చాలామందికి అంతుచిక్కని ఒక ప్రశ్నే. అయితే దీనికి అనేక కారణాలు ఉంటాయట. ప్రోటీన్ లోపమే కాదు, మానసిక ఆందోళన, కోపం, ఒత్తిడి వంటి వాటి వల్ల కూడా జుట్టు ఊడిపోయే సమస్య పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు.
ప్రోటీన్ లోపాన్ని గుర్తించిన పరిశోధకులు దానికోసం ఒక క్రీమ్‌ను తయారు చేయనున్నారట. వారు చెప్పినదాని ప్రకారం అంత త్వరగా ఈ క్రీమ్ ను తయారుచేయలేరు. ప్రస్తుతం ఎలుకలపై మాత్రమే పరిశోధన సాగింది. మనుషులపై కూడా ఓసారి పరిశోధన జరగాలి. ఆ తరువాతే ప్రోటీన్‌ను క్రీమ్ రూపంలో తేవాలా లేక ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అన్నది ఆలోచిస్తారు.
ముఖ్య గమనిక.. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించిన ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యానికి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. వైద్య నిపుణులను సంప్రదించి దాని ప్రకారం మాత్రమే చికిత్స తీసుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com