Post pandemic: నాలుగేళ్ల పిల్లల్లోనూ మానసిక రుగ్మతలు

Post pandemic: నాలుగేళ్ల పిల్లల్లోనూ మానసిక రుగ్మతలు
4 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లోనూ మానసిక ఆందోళన...తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

హైదరాబాద్‌కు చెందిన నాలుగేళ్ల విద్యార్థి బాగా తలనొప్పి, వికారంగా ఉందని తల్లిదండ్రులకు చెప్పాడు. సహజంగా బడికి వెళ్లకుండా ఉండేందుకు పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తుంటారని ఆ తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. కానీ రెండు రోజుల తర్వాత ఆ చిన్నారి తరచుగా వాంతులు చేసుకోవడంతో వెంటనే నీలోఫర్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఆ చిన్నారికి వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత అతడు ఆందోళనతో బాధ పడుతున్నాడని నిర్ధారించి పిల్లల మానసిక విభాగానికి పంపారు. ఇటీవల పిల్లల్లో ఇలాంటి కేసులు తరచుగా వస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఇంతకీ ఏం జరుగుతుందంటే....


కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత 4 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లోనూ మానసిక ఆందోళన పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ప్రతీ ఏడుగురు భారతీయులలో ఒకరు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు నాలుగేళ్ల చిన్నారుల్లో కూడా ఇలాంటి రుగ్మతలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. 4 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు చాలామంది పాండమిక్ అనంతర ఆందోళనలు, వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

మళ్లీ మళ్లీ కడుపు నొప్పి రావడం, తలనొప్పి, వాంతులు వంటి రుగ్మతలు కరోనా మహమ్మారి సంక్షోభం తర్వాత పిల్లల్లో వచ్చే ఆందోళన లక్షణాలు కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పాఠశాలకు వెళ్లకుండా ఉండేందుకు చిన్నారులు అలా చేస్తున్నారని అన్నిసార్లు పొరబడవద్దని సూచిస్తున్నారు. పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడి వారి మానసికస్థితిని విశ్లేషిస్తామని... అవసరమైతే నాలుగేళ్ల చిన్నారులకు కూడా మందులు ఇస్తున్నామని నీలోఫర్‌ చైల్డ్ సైకియాట్రీ విభాగం వైద్యులు హృషికేష్ గిరి ప్రసాద్ తెలిపారు. పిల్లల్లో ప్రతిరోజూ కనీసం 20 కేసులు ఇలాంటివి కనిపిస్తున్నాయని... పె‌ద్దల్లో 20 నుంచి 30 మానసిక రుగ్మతలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఆయన వివరించారు. ముఖ్యంగా 4 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులు మహమ్మారి తర్వాత ఆందోళన, ఒత్తిడికి గురవుతారని.. ఈ విషయాన్ని వారు వ్యక్తీకరించలేరని ఆరోగ్య నిపుణులు తెలిపారు. చిన్నపిల్లలు వారి భావాలను మాటలతో చెప్పలేరని.. అందుకే కడుపు నొప్పి, వికారం, ఆందోళన వంటి లక్షణాలకు ఎక్కువగా గురవుతారని వివరిస్తున్నారు. యువతలోనూ ఇలాంటి మానసిక ఆందోళన కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కౌమారదశలో ఉన్నవారిలో చిన్నదానికే విపరీతమైన కోపం, పెద్దల మాటకు ఎదురు చెప్పడం వంటి చర్యలు కూడా మానసిక ఆందోళన లక్షణాలు కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు.


ప్రస్తుతం ఆస్పత్రికి వస్తున్న ప్రతీ అయిదు మానసిక రుగ్మత కేసుల్లో ఒకటి కరోనాకు సంబంధించనదే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఫోన్‌ వ్యసనంగా మారడం వంటి చర్యలు కౌమార దశలో మానసిక రుగ్మతలను పెంచుతున్నాయని వైద్యులు తెలిపారు. యువతలో అజీర్ణం, తలనొప్పి మానసిక ఒత్తిడికి కారణమని... అలాంటి లక్షణాలు తరచుగా వస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story