Healthy Habits: ఆరోగ్యం కోసం ఈ ఆరు అలవాట్లు..

Healthy Habits: ఆరోగ్యం కోసం ఈ ఆరు అలవాట్లు..
Healthy Habits: ఈ చిన్న చిన్నమార్పులే రేపు మీకు ఎదురయ్యే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించవచ్చు.

Health Habits: ఆరోగ్యం బావుండాలని ఆస్పత్రులకు వెళ్లకూడదని అందరూ అనుకుంటారు.. కానీ ఆచరణ విషయం వచ్చేసరికి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదాలు వేస్తుంటారు. అందుకే ఏ పని మొదలు పెట్టినా ఈ రోజే ఈ క్షణం నుంచి ఆచరించేందుకు ప్రయత్నించాలి. కనీసం మన చేతుల్లో ఉన్నవి అయినా మనం సక్రమంగా చేయడానికి ప్రయత్నించాలి.

ఆహారం మితంగా తీసుకోవడం, వ్యాయామం చేయడం, త్వరగా నిద్ర పోవడం వంటివి చేస్తుంటే ఆరోగ్యం బావుంటుంది. ఇవేవీ చేయకుండా శరీరం వ్యాధుల బారిన పడిన తరువాత అనుకున్నా ఉపయోగం ఉండదు.. ఉరుకుల పరుగుల జీవితం అయినా మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మీరు చేసే ఈ చిన్న చిన్నమార్పులే రేపు మీకు ఎదురయ్యే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించవచ్చు. వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి.

రోజుకు 10వేల అడుగులు

ఆఫీసుల్లో కూర్చుని పని చేయడం, ఇంటికి వెళ్లగానే అలసిపోయి నిద్రపోవడం.. అందుకే ఒక టైమ్ కేటాయించుకుని కచ్చితంగా రోజుకు 10 వేల అడుగులు నడవడానికి ప్రయత్నించాలి. లేదంటే ఓ గంట వ్యాయామం చేయాలి.. ఏది చేసిన శరీరానికి చెమట పడుతుంది.. శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వు కరుగుతుంది.

జ్యూస్ లకు బదులు పండ్లు మేలు..

వేసవి కాలం.. జ్యూస్ చేసి చల్లగా ఫ్రిజ్ లో పెట్టుకుని తాగుతుంటాం.. చప్పగా ఉందని దానికి కొంచెం పంచదార కూడా జోడిస్తాం.. మళ్లీ దాన్ని వడకట్టడంతో ఫైబర్ కూడా పోతుంది.. ఇలా జ్యూస్ రూపంలో తీసుకోవడం కంటే పండు రూపంలో తీసుకుంటే పంచదారతో పని ఉండదు.. శరీరానికి కావలసిన ఫైబర్ అందుతుంది.

వేసవి కాలం అయినా పరగడుపున ఓ గ్లాస్ వేడినీళ్లు

ఎండలు మండిపోతున్నాయి.. చల్లగా ఫ్రిజ్ లో వాటర్ కానీ, కుండలో నీళ్లు కానీ తాగాలని ఉంటుంది ఉదయం లేవగానే. కానీ పరగడుపున తాగే నీరు గోరువెచ్చగా ఉంటే జీర్ణ వ్యవస్థ పని తీరు బావుంటుంది. శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి. వేడినీళ్లు తాగినప్పుడు తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

నిద్ర సరిపడినంత

రాత్రి పడుకునేంత వరకు మొబైల్స్ చూడడం.. కొంతమంది పక్కలోనూ, మరికొంత మంది దిండు కింద పెట్టుకుంటారు.. కానీ ఫోన్ రేడియేషన్ అస్సలు మంచిది కాదు. ఫోన్ చూస్తూ కూర్చుంటే నిద్ర పోవాలనే ఆలోచన కూడా రాదు. రోజుకు కనీసం 6-8 గంటల నిద్ర అవసరం. అప్పుడే మెదడు చురుగ్గా పని చేస్తుంది. శరీరం పని చేయడానికి సహకరిస్తుంది. కాబట్టి వేళకు నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి.

పంచదారకు బదులు బెల్లం

చాలా మందికి ఉదయాన్నే చక్కటి, చిక్కటి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీలో కచ్చితంగా పంచదార వేయాల్సి ఉంటుంది. అదే టీలో అయితే పంచదార బదులు బెల్లం వాడొచ్చు. టీ, కాఫీలు మానేయడం కష్టం అనుకుంటే ఓ కప్పు అల్లం, బెల్లం వేసిన టీ తాగడం ఉత్తమం. బెల్లంలో శరీరానికి కావలసిన పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ అదికంగా ఉంటాయి.

సమయానికి భోజనం

సమయానికి భోజనం చేస్తే సమస్యలు ఉండవు. భోజనం మానేయడం లేదా లేటుగా తినడం రెండూ మంచివి కావు. ప్రతిరోజు నిర్ధేశించుకున్న సమయానికి భోజనం తప్పనిసరిగా చేయాలి. అలాగే ఒకేసారి ఎక్కువ తినేయడం కూడా అంత మంచిది కాదు. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినడం మేలు. అలా చేయడం వలన శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story