Vrikshasana: సయాటికా నరాల సమస్యను దూరం చేసే వృక్షాసనం..

Vrikshasana: ఒకేసారి ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను కూడా పెంచేది యోగా. గత కొంతకాలంగా చాలామంది యోగాను తమ రోజూవారీ దినచర్యలో చేర్చి మానసికంగానే కాదు శారీరికంగా కూడా ధృడంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. యోగా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలామందికి తెలుసు. అందులోని ఒక్కొక్క ఆసనం.. ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఏకాగ్రత పెంచుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఆసనం ఉంది.
యోగాలోని ఒక్కొక్క ఆసనం వల్ల కేవలం ఒక్క ఉపయోగం మాత్రమే ఉండదు. అలాగే ఏకాగ్రత పెరగడం కోసం వేసే వృక్షాసనం కూడా అంతే. దీని వల్ల పాదాలు, మడమలు, మోకాళ్లు బలపడతాయి. అంతే కాకుండా దీని వల్ల సయాటికా నరాల సమస్య కూడా దూరమవుతుంది. అందుకే చాలామంది యోగా ట్రైనర్లు.. యోగా మొదలుపెట్టిన కొన్నిరోజులకే ఈ ఆసనం వేయమని సూచిస్తారు.
ఇంతకీ వృక్షాసనం ఎలా వేయాలంటే.. ముందుగా పాదాలను దగ్గరగా పెట్టి నిలుచోవాలి. తర్వాత కుడికాలును ఎడమ మోకాలు పైభాగంలో పక్కకు ఆనించి నిలుచోవాలి. ఇలా బ్యాలెన్స్ చేస్తూ చేతులు రెండు పైకెత్తి నమస్కారం చేస్తున్నట్టుగా ఉంచాలి. నిటారుగా నిలబడి శ్వాసను మామూలుగా పీల్చాలి. 10 సెకన్లు ఇలాగే ఉండాలి. తర్వాత నెమ్మదిగా చేతులు, కాళ్లను ఫ్రీ చేసుకోవాలి. ఎడమకాలి పాదంతో కూడా తరువాత పది సెకన్లు పాటు ఇలాగే చేయాలి. ఈ వృక్షాసనం వేయడం వల్ల ఏకాగ్రత పెరగడం ఖాయం అంటున్నారు నిపుణులు.
Disclaimer: ఈ యోగాసనానికి సంబంధించిన సమాచారమంతా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి యోగాసనాలు వేయడానికి ముందు నిపుణులు సలహాలు, సూచనలు తీసుకోవాలి. వారి సమక్షంలోనే దీనిని ప్రాక్టీస్ చేయాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్యులను సంప్రదించి వారి సూచనలను పాటించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com