చిన్నారుల్లో మలబద్దకం.. సునాముఖి ఆకుతో చెక్..

సునాముఖిని సంస్కృతంలో స్వర్ణపత్రి అని పిలుస్తారు. ఇది చిన్నారుల్లో ఉన్న మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆయుర్వేదంలో వివిధ ఔషధ ప్రయోజనాల కోసం ఈ ఆకును, పువ్వులను కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం సునాముఖి ఆకు మలబద్ధకాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఈ ఆకు పొడిని కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా భారీగా పెరిగిన బరువును కూడా తగ్గించుకోవడంలో కూడా సునాముఖీ ఆకు సహాయపడుతుంది. ఈ ఆకులో ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రేగులలోని పురుగులను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.
సునాముఖి ఆకు పేస్ట్‌ను చర్మంపై అప్లై చేయడం వల్ల దానిలోని ఔషధ గుణం కారణంగా మంట, పొక్కులు, ఎరుపు వంటి వివిధ చర్మ సమస్యలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అయితే దేనినైనా అధికంగా వినియోగిస్తే అనర్థమే. అది సునాముఖి ఆకుకి కూడ వర్తిస్తుంది. ఈ ఆకును అధికంగా వినియోగిస్తే తీవ్రమైన విరేచనాలతో పాటు శరీరం నుండి ద్రవాలు కోల్పోవటానికి కారణమవుతుంది. కాబట్టి వైద్యుని సిఫారసు మేరకు తీసుకోవడం మంచిది.
ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త దోషం కారణంగా మలబద్ధకం ఏర్పడుతుంది. తరచుగా జంక్ ఫుడ్ తీసుకోవడం, కాఫీ లేదా టీలు ఎక్కువగా తీసుకోవడం, రాత్రిళ్లు మెలకువతో ఉండడం,ఒత్తిడి, డిప్రెషన్ వంటి అంశాలు శరీరంలో వాత, పిత్త చర్యలను తీవ్రతరం చేసి మలబద్ధకానికి దారితీస్తాయి. సునాముఖి ఈ చర్యలను సమతుల్యం చేస్తుంది. తద్వారా మలబద్ధకాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.
మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో 2 గ్రాముల సునాముఖి ఆకు పొడి కలిపి తాగాలి. దీంతో లేచీ లేవగానే బాత్‌రూమ్‌కు పరిగెట్టేస్తారు. కడుపు శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఆకలి కూడా బాగా అవుతుంది. ఈ సునాముఖి ఆకు పొడి చిన్నారులే కాదు మలబద్దకంతో బాధపడుతున్న పెద్దవారు కూడా నిశ్చింతంగా వాడవచ్చని చెబుతోంది ఆయుర్వేదం. ఏది ఏమైనా ఓసారి వైద్యుని సంప్రదించి వాడితే మంచిది. మీ ఆరోగ్య పరిస్థితి, మీ శరీరతత్వాన్ని బట్టి వైద్యులు సూచించిన మేర నడుచుకోవడం అత్యంత ముఖ్యం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com