Raj Kumar Heart Attack: ఫిట్‌గా ఉంటే గుండెపోటు ఎందుకు వస్తుంది.. వైద్యులు ఏం చెబుతున్నారు..

Heart Attack: ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరం.. అయితే శరీర అవసరానికి మించి కష్టపడితే గుండెపై భారం పడుతుంది.. అదే కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణానికి కారణమైందని అంటున్నారు వైద్యులు. ఇంట్లోనే జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు పునీత్. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. అప్పటికే గుండె ఆగిపోయింది. ఓ ధృవతార నేలకొరిగింది. తమ అభిమాన నటుడు, అంతకు మించి సేవాతత్పరుడుని కోల్పోయిన కన్నడిగులు కన్నీరుమున్నీరవుతున్నారు.
శారీరకంగా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్ గుండెపోటుతో మరణించడం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దాంతో ఇప్పుడు అందరికీ జిమ్‌లో హెవీ వర్కవుట్లు చేయాలంటే భయం పట్టుకుంది. అయితే ఏదైనా మితంగా తింటే భోజనం రుచిగా ఉన్నట్లు.. వ్యాయామం కూడా శరీర సూచనల మేరకు చేస్తేనే ఆరోగ్యం అని వివరిస్తున్నారు హృదయ సంబంధిత నిపుణులు.
మనిషి ధృఢంగా ఉన్నంత మాత్రాన ఫిట్‌గా ఉన్నట్లు కాదు.. వర్కవుట్లు ఎక్కువగా చేసినప్పుడు శరీరంలో హార్ట్‌బీట్ రిథమ్ దెబ్బతింటుంది. దీంతో సడెన్ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే శరీరంలోని అదనపు కాల్షియం ముక్కలుగా ఏర్పడి రక్తనాళాల్లో అతుక్కొని ఉంటుంది. శక్తికి మించి వ్యాయామాలు చేసినప్పుడు గుండె, ఊపిరితిత్తుల్లో ఆ ముక్కలు ఇరుక్కుపోతాయి. దీంతో ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. జన్యపరమైన కారణాలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. గుండె వేగం పెరిగి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
సాధారణంగా రోజుకు 30 నిమిషాల పాటు వర్కవుట్ చేస్తే సరిపోతుంది. ఉన్నపళంగా బరువు తగ్గిపోవాలని ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం అంత శ్రేయస్కరం కాదని చెబుతున్నారు కార్డియాలజిస్టులు. ఇలా చేయడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గుండె శరీరంలోని మిగతా భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఫలితం హార్ట్ స్ట్రోక్‌కి దారితీస్తుంది.
తీసుకునే ఆహరం కూడా ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. హెవీ వర్కవుట్లు చేశాక తగినంత రెస్ట్ కూడా ముఖ్యం.
వ్యాయామాలు చేస్తున్నప్పుడు గమనించవలసిన ముఖ్య అంశాలు..
వర్కవుట్ చేస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపించినా, అలసటగా ఉన్నా తక్షణమే నిలిపివేయాలి. ఇలాంటి సమస్యలు పదే పదే ఎదురవుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
యువత గుండె ఎందుకు వీక్ అవుతోంది..
ఇందుకు జీవనశైలి ప్రధాన కారణం. సమయానికి భోజనం, నిద్ర ఉండట్లేదు. ఒత్తిడి ఎక్కువవుతోంది. జంక్‌ఫుడ్ పట్ల ఆకర్షితులవుతున్నారు. రోజుకు 14 గంటలు పని చేస్తున్నారు. వీకెండ్స్‌లో హెవీ వర్కవుట్లు, మారథాన్లు అంటూ శరీరంపై ఒత్తిడిని పెంచే ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. ఇది మీ శరీరానికి ఎంత వరకు మేలు చేస్తుందో చూసుకొని చేయాలి.
డాక్టర్లు సూచించిన మరికొన్ని ముఖ్యమైన సూచనలు..
నెల రోజులు పది కిలోల బరువు తగ్గిస్తాం అనే సూచనలు చూసి మోసపోవద్దు
యూట్యూబ్ ఛానెల్స్, యాప్‌లు చూసి వ్యాయామాలు చేయొద్దు.
నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. శరీరాన్ని ఇబ్బంది పెట్టే భంగిమలు చేయకపోవడం మంచిది.
అన్నిటికంటే ఉత్తమం సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్, నడక, యోగా.
సిక్స్ ప్యాక్‌ల పేరుతో హెవీ వర్కవుట్లు చేయకూడదు.
పౌడర్లు, పానీయాలు తాగి స్లిమ్ అవ్వాలని అనుకోవద్దు..
జీవన శైలి, పోషకాలతో కూడిన ఆహారం, వైద్యులు సూచించిన వ్యాయామాలు.. ఆరోగ్యానికి రక్షణలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com