వేసవిలో వేడిని తగ్గించే ప్రాణాయామాలు.. రోజులో ఎప్పుడైనా చేయొచ్చు

వేసవిలో వేడిని తగ్గించే ప్రాణాయామాలు.. రోజులో ఎప్పుడైనా చేయొచ్చు
శరీరాన్ని చల్లబరిచడానికి దాహార్తిని తీర్చే పండ్లు, జ్యూసులు తీసుకుంటూనే కొన్ని ప్రాణాయామాలు చేస్తే ఎండ వేడిమిని మీ శరీరం తట్టుకుంటుంది.

ఎన్ని నీళ్లు తాగుతున్నా గొంతు తడారి పోతోంది.. వేడి తట్టుకోలేకపోతున్నాం.. వేసవి కాలంలో ఎక్కువగా వినిపించే మాటలు ఇవి. శరీరాన్ని చల్లబరిచడానికి దాహార్తిని తీర్చే పండ్లు, జ్యూసులు తీసుకుంటూనే కొన్ని ప్రాణాయామాలు చేస్తే ఎండ వేడిమి నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది. అవి మీరు ఆఫీసులో పని చేస్తున్నా చేసుకోవచ్చు.. ఇంట్లో టీవీ చూస్తూ కూడా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం. హీట్ స్ట్రోక్‌తో బాధపడేవారికి ఈ శీతలీకరణ ప్రాణాయామాలు చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి. మీరు రోజులో ఎప్పుడైనా వీటిని ప్రాక్టీస్ చేయవచ్చు.

వేడి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, శరీరం చల్లగా ఉంచడానికి వివిధ మార్గాలను ఆశ్రయించవచ్చు. రెగ్యులర్ డైట్‌లో నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.

పుచ్చకాయ, సిట్రస్ పండ్లు అన్నీ శరీరం డీ హైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడతాయి. శరీరం తేలికగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలను సరఫరా చేస్తాయి. పెరుగు కూడా ఒక అద్భుతమైన ఎంపిక. ఇక యోగా అనేది ఆరోగ్యకరమైన ఆహారానికి అదనపు బోనస్ అవుతుంది. వేసవికాలంతో పోరాడటానికి యోగా నిజంగా సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రెండు ప్రాణాయామ పద్ధతులు శరీరాన్ని చల్లబరిచి రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడతాయి. అందులో ఒకటి శీతలీ కరణ ప్రాణాయామం 2. శీత్కారీ ప్రాణాయామం

1. శీతలీ ప్రాణాయామం:

ఇది ఒక రకమైన శ్వాస ప్రక్రియ. ఇది మీ శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. యోగా మ్యాట్ కానీ మరేదైనా కానీ వేసుకుని పద్మాసనంలో లేదా సుఖాసనంలో కూర్చోవాలి. చేతులు రెండూ మోకాళ్ల మీద ఉంచి రిలాక్స్‌డ్‌గా ఉండాలి. ఇప్పుడు మీ నాలుకను ఒక ట్యూబ్ మాదిరిగా చేసి దాని ద్వారా లోపలికి గాలిని పీల్చాలి. అలా పీల్చిన గాలిని లోపల ఉంచి నోరు మూసెయ్యాలి. ముక్కు ద్వారా శ్వాస బయటకు వదిలివేయబడుతుంది. ఇలా రోజులో 10 నుంచి 20 సార్లు చేయొచ్చు.
2. శీత్కారి ప్రాణాయామం:

ఇది కూడా పైన పేర్కొన్న పద్ధతిలోనే ఉంటుంది. కాకపోతే ఒకే తేడా ఏమిటంటే, ఇది పళ్ళతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు పైన చెప్పిన పద్దతిలోనే కూర్చుని పై పళ్లను, క్రింది పళ్లను కలిపి ఉంచి శ్వాస తీసుకోవాలి. గట్టిగా, సుదీర్ఘంగా శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న శ్వాసను నిదానంగా ముక్కుద్వారా బయటకు విడుదల చేయాలి. ఇలా 10 నుంచి 20 సార్లు చేస్తే చాలా రిలీఫ్‌గా ఉంటుంది.
గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు లో బీపీ ఉన్నవారు, ఫ్లూ లేదా జలుబు, ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ ప్రాణాయాలను చేయకూడదు.

ఇతరులెవరైనా చేయొచ్చు. ఎవరైనా మొదలు పెట్టేటప్పుడు ఈ ప్రాణాయామ వ్యాయామాలను నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్చ్వాసలు రెండూ నెమ్మదిగా ఉండాలి.

Tags

Read MoreRead Less
Next Story