అధికారులపై ఎంపీ ఆగ్రహం.. గాడిదలు కాస్తున్నారా అంటూ..
Karnataka MP Munuswami fires on RTO Employees

మీ డ్యూటీని కూడా మీరు సక్రమంగా నిర్వర్తించకపోతే ఎట్లా.. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ మాత్రం పట్టదా మీకు.. అలాంటప్పుడు ఉద్యోగాలు ఎందుకు చేయడం, రాజీనామా చేయండి అని ఆర్టీవో అధికారులపై విరుచుకుపడ్డారు కర్ణాటక ఎంపీ మునిస్వామి. చింతామణి తాలుకాలోని మరినాయకనహళ్లి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన ఘటనపై ఎంపీ మునిస్వామి అధికారులపై నిప్పులు చెరిగారు.
సోమవారం ఉదయం ఆయన చింతామణి ఆస్పత్రిలో మృతదేహాలకు నివాళులర్పించిన అనంతరం ఆర్టీఓ అధికారులను అక్కడికే పిలిపించి మందలించారు. వారిని చూస్తూనే తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎంపీ.. విధులు నిర్వహించకుండా గాడిదలు కాస్తున్నారా.. చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా నడుపుతున్న వాహనాలను సీజ్ చేయకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అంతకు ముందు ఆయన మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు అందించారు. ఎంపీ వెంట డీఎస్‌పీ లక్ష్మయ్య, తహశీల్దార్ హనుమంత రాయప్ప తదితరులు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com