అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఫైర్

అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేసింది కాంగ్రెస్. అదానీ గ్రూపును కాపాడేందుకు ఎఫ్‌పీవోలో పెట్టుబడులు పెట్టాలంటూ కేంద్ర మంత్రి ఒకరు పారిశ్రామికవేత్తలను ఆదేశించలేదా? అని ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈ మేరకు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ప్రశ్నలు సంధించారు. కేంద్ర మంత్రివర్గంలోని ఓ హైప్రొఫైల్ మంత్రి ఐదారుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేసి. గౌతమ్ అదానీ గ్రూపు ఎఫ్‌పీవోలో వారి సొంత నిధులు పెట్టుబడిగా పెట్టాలని ఆదేశించడం నిజం కాదా? ఇది నిబంధనలను ఉల్లంఘించడం కాదా' అని ప్రశ్నించారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవోలో ఎల్‌ఐసీ 299 కోట్లు, SBI ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ 99 కోట్లు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 125 కోట్లకు బిడ్ వేశాయని.. ఇవన్నీ ప్రభుత్వరంగ సంస్థలని రమేశ్ తెలిపారు. అదానీ గ్రూపును బయటపడేసేందుకు ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రజాధనాన్ని మరోసారి పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తారా? అని రమేశ్ నిలదీశారు. గౌతమ్ అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకల్లో ఆయన సోదరుడు వినోద్ అదానీ కీలక పాత్ర పోషించారని.. ఇది సెబీ, ఈడీలు దర్యాప్తు చేయదగ్గ అంశమన్నారు. ప్రధాని మోదీ మౌనిబాబాలా ఉన్నంత మాత్రాన తాము ప్రశ్నించకుండా ఉండబోమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com