ఖలిస్థానీ నాయకుడి అరెస్ట్ కు రంగం సిద్దం.. పంజాబ్ లో ఇంటర్నెట్ బంద్
సమస్య తీవ్రం కాకముందే ఖలిస్థానీ నాయకులను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్, అతని సహాయకులను అరెస్టు చేసేందుకు పంజాబ్ పోలీసులు రంగం సిద్దం చేశారు. శనివారం ఆపరేషన్ ప్రారంభించడంతో పంజాబ్ అంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. రాడికల్ నాయకుడు, ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ గత కొన్ని వారాలుగా పంజాబ్‌లో ఘర్షన వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. అమృత్‌పాల్ సహాయకులలో ఒకరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అతని మద్దతుదారులు గత నెలలో అమృత్‌సర్ శివార్లలోని అజ్నాలా పోలీసులతో ఘర్షణకు దిగారు.
సమస్య తీవ్రం కాకముందే ఖలిస్థానీ నాయకులను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. శనివారం జలంధర్‌లో అమృతపాల్‌కు చెందిన ఆరుగురు సహాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ నిలిపివేసినందున ప్రజలు అనవసరపు భయాందోళనలకు గురికావద్దని పోలీసులు తెలిపారు. ఫేక్ న్యూస్, ద్వేషపూరిత ప్రసంగాలను పోస్ట్ లను వ్యాప్తి చేయవద్దని కోరారు. ఇందుకుగాను పంజాబ్ పోలీసులు ట్వీట్ చేశారు.