అమ్మకానికి జయలలిత ఆస్తులు

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులు విస్తుగొలుపుతూనే ఉన్నాయి. ఇపుడు జయలలిత ఆస్తుల అమ్మేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమార్జన కేసులో జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తుల్ని విక్రయించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. 1996 నాటి అక్రమార్జన కేసును సుప్రీంకోర్టు 2003లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేసింది. సాక్ష్యాల రూపంలో 1996లో చెన్నైలోని జయ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ఆధీనంలో ఉన్నాయి. 7 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి ఆభరణాలు, 11 వేలకు పైగా చీరలు, 750 జతల పాదరక్షలు, 91 చేతి గడియారాలు, 131 సూట్ కేసులు, ఒక వెయ్యి 40 వీడియో క్యాసెట్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, విద్యుత్తు పరికరాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. విస్తుగొలుపుతున్న తళైవి ఆస్తుల్ని ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
జయలలిత మరణం తర్వాత ఆమె ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. అమ్మ వారసులెవరు? జయ ఆస్తులు ఎవరికి చెందాలి? హక్కు ఎవరికి ఉంది? అన్నది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీపక్, దీప చెప్పిన ప్రకారం జయలలిత ఆస్తులు 188 కోట్లుగా ఉంది. తమిళనాడు సర్కారు మాత్రం 913 కోట్లుగా నిర్ధారించింది. ఇక విచారణ సందర్భంగా జయ ఆస్తుల విలువ వెయ్యి కోట్లకు పైగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
జయలలిత ఫేవరెట్ సమ్మర్ ట్రీట్ అయిన కొడనాడ్ టీ ఎస్టేట్ 900కు పైగా ఎకరాల్లో ఉంది. 1992లో కొన్న ఆ ఎస్టేట్ విలువ ఎకరాకు కోటి ఉంటుందని అక్కడి స్థానికులు అంటున్నారు. తన ఫ్రెండ్ శశికళ, ఇతర అసోసియేట్స్‌తో కలిసి 32 కంపెనీలను ప్రారంభించారు జయలలిత. అంతేకాదు సుమారు 173 ప్రాపర్టీల్లో కనీసం వంద వాటిల్లో జయలలిత భాగస్వామిగా ఉన్నారు.
ఇక.. సినిమాల్లో నటిస్తున్న టైమ్‌లో హైదరాబాద్‌లో కొన్ని విలువైన ఆస్తులను జయలలిత కొన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో ఉన్న 14 ఎకరాల జేజే గార్డెన్ ఫామ్ హౌజ్ ఉంది. బత్తాయి, ద్రాక్ష తోటలతో ఆ ఫామ్ హౌజ్‌ను అందంగా తీర్చిదిద్దారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని రాధిక కాలనీలో జయలలితకు సొంతిల్లు ఉంది. శ్రీనగర్ కాలనీలో 600 గజాల్లో ఓ ఇంటిని కొన్నారు జయలలిత.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com