తెలుగు రాష్ట్రాల్లో సుర్రుమంటున్న సూర్యుడు..పలు జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలుగు రాష్ట్రాల్లో సుర్రుమంటున్న సూర్యుడు..పలు జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌
పలు జిల్లాల్లో ఆరెంజ్‌ కలర్ హెచ్చరికలు జారీ ఇవాళ, రేపు సాధారణం కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఉదయం నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఏపీ, తెలంగాణలో రోజురోజుకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ప్రతాపం చూపిస్తున్న ఎండలు పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఇక వడగాలుల తీవ్రత మరింత పెరిగి బెంబేలెత్తిస్తున్నాయి.

తెలంగాణలో 15 జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. గరిష్ఠంగా నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌లో 42.8 డిగ్రీలు నమోదైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో 42.7, నల్గొండ జిల్లా కట్టంగూర్‌, ఆదిలాబాద్‌ అర్బన్‌లలో 42.6, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 42.5, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లలో 42.4, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లలో 42.2, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి, నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం లక్మాపూర్‌, వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం కేతేపల్లిలలో 42.1, రాజన్నసిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మార్తాన్‌పేట, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లలో 41.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. హైదరాబాద్‌ గరిష్ఠంగా సైదాబాద్‌ మండలం అస్లాంగఢ్‌లో 37.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది.

అటు ఏపీలోను వడగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణశాఖ అంచనా వేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాలోని మొత్తం 26 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరుకోవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే రేపు విజయనగరం, కడప, ఎన్టీఆర్‌ జిల్లా, అనకాపల్లి, మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, శ్రీకాకుళం, అల్లూరి జిల్లా, విశాఖ, కృష్ణా, నంద్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టంచేసింది. ఎండల నుంచి తెలుగు రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

ఇక తెలంగాణలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై టీఎస్‌డీపీఎస్‌.. ప్రభుత్వానికి అప్రమత్తం చేసింది. పలు జిల్లాల్లో ఆరెంజ్‌ కలర్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు సాధారణం కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లోను ఎండలు మండిపోతున్నాయి. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బెంగాల్, చత్తీస్‌‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉంటుందని ఐఎండీ స్పష్టంచేసింది. ఈనెల 19 వరకు ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది. జూన్​వరకు పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని తెలిపింది. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ్లల్లో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.

Tags

Next Story