Elections 2024 : బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ రెడీ

Elections 2024 : బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ రెడీ

దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కూటమి కట్టేందుకు ఇప్పటికే సిద్ధమవుతుండగా.. విపక్ష కూటమి నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై చర్చోప చర్చలు జరిగాయి.. అయితే, తాజాగా విపక్ష కూటమికి నాయకత్వం వహించేది కాంగ్రెస్సేతర నేతేననే ప్రచారం సరికొత్తగా జరుగుతోంది.. కాంగ్రెస్సేతర బలమైన నేతను కూటమి చైర్‌ పర్సన్‌ లేదా కన్వీనర్‌గా నియమించాలనే కీలక ప్రతిపాదన తెరమీదకు వచ్చింది.. రాహుల్‌ గాంధీ సహా ఇతర కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశంలో బీహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీష్‌ కుమార్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.. బీఆర్‌ఎస్‌ సహా దూరంగా వుంటున్న పార్టీలను కలుపుకొని వెళ్లాలని ఆయన సూచించినట్లుగా సమాచారం. అయితే, ఈ సూచనలపై సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్‌ ముఖ్యులు.. వారితో మాట్లాడాలని నితీష్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇటు విపక్షాల కూటమిలో కీలకంగా వ్యవహరించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇదే మాట ఆయన డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఇటీవల బహిరంగ సభల వేదికగా ఇలాంటి సంకేతాలనే పంపిస్తూ వచ్చారు.. నితీష్‌ కుమార్‌, మమత, అఖిలేష్‌, కేజ్రీవాల్‌, కుమారస్వామితో చర్చలు కూడా జరిపారు. అటు ఇప్పటికే కాంగ్రెస్‌ ముఖ్యులతో చర్చలు జరిపిన నితీష్‌ కుమార్‌.. త్వరలో కేసీఆర్‌తో మరోసారి భేటీ అవుతరానే ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్సేతర విపక్ష నాయకుడికే విపక్ష కూటమి నాయకత్వ బాధ్యతలు ఇచ్చే అంశంపై రాహుల్‌ సహా కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో నితీష్‌ కుమార్‌ జరిపిన చర్చల్లో స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లుగా ఢిల్లీ వర్గాలంటున్నాయి.. బీఆర్‌ఎస్‌ సహా దూరంగా ఉంంటున్న పార్టీలను కలుపుకొని వెళ్లాలని ఆ భేటీలో నితీష్‌ కుమార్‌ సూచించారు.. నితీష్‌ సూచన పట్ల సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్‌ ముఖ్యులు వారితో మాట్లాడాలని జేడీయూ అధినేతకు చెప్పినట్లుగా రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా గతానికంటే భిన్నంగా కాంగ్రెస్‌తో కలసి వస్తున్న తీరు కూడా చర్చనీయాంశం అవుతోంది.. ఈ నేపథ్యంలోనే అందరం కలసి వెళ్లేలా మమత, కేసీఆర్‌తో మాట్లాడాలని నితీష్‌ కుమార్‌కు కేజ్రీవాల్‌ సలహా ఇచ్చినట్లుగా మాచారం.. అందరి సూచనలతో త్వరలోనే మమతా బెనర్జీ, కేసీఆర్‌తో నితీష్‌ భేటీ కానున్నారనే వార్తలొస్తున్నాయి.

ఇక విపక్ష కూటమి ఏర్పాటుకు నేతల పరిశీలనలో పలు నమూనాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ సర్దుబాటు అంతా లోక్‌ సభ సీట్ల విషయంలోనే జరుగుతుందని... అసెంబ్లీకి వచ్చే వరకు ఎవరి దారి వారిదేననే మాట వినిపిస్తోంది.. ఏ ప్రాతిపదికన కూటమి ఏర్పాటు కావాలన్న దానిపైనా ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే 1996, 1998, 2004 నాటి నమూనాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది... కాంగ్రెస్‌తో కూడిన దళం ఏర్పాటు చేయాలా లేక కొత్త దళానికి కాంగ్రెస్‌ బయటి నుంచి మద్దతు ఇచ్చేలానా అనే దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లుగా సమాచారం.. అయితే, కాంగ్రెస్‌తో కూడిన కూటమికే మెజారిటీ విపక్ష పార్టీలు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.. అసెంబ్లీ వరకు ఎవరి పోరాటం వారిదే అయినా, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే నిర్ణయానికి విపక్ష పార్టీల కీలక నేతలు వచ్చినట్లుగా సమాచారం.. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, బలాబలాల ఆధారంగా లోక్‌సభ సీట్ల సర్దుబాటు జరగాలని సదరు నేతలు అంటున్నారు.

ఈ మొత్తం పరిణామాలను చూస్తుంటే త్వరలోనే విపక్ష పార్టీల నేతలంతా ఒకే వేదికపైకి వస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. మమతా బెనర్జీ, కేసీఆర్‌తో నితీష్‌ కుమార్‌ భేటీ అనంతరం తేదీ, వేదికపై స్పష్టత వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.. అదే సమయంలో వైసీపీ, బిజూ జనతాదళ్‌ నేతలతోనూ మాట్లాడాలని నితీష్ కుమార్‌కు ఇతర పార్టీల ముఖ్యులు సూచించినట్లుగా తెలుస్తోంది.. మొత్తంగా విపక్ష కూటమి ఏర్పాటుకు అంతర్గతంగా చర్చోప చర్చలు సాగుతున్నట్లుగా సమాచారం. ఈ చర్చలు ఎలాంటి ఫలితాన్నిస్తాయి..? విపక్ష కూటమికి నాయకత్వం వహించేది ఎవరనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tags

Next Story