National : రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి : వీర్ సావర్కర్ మనవడు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రముఖ స్వతంత్ర్య సమర యోధుడు వీర్ సావర్కర్ ( వినాయక్ దామోదర్ సావర్కర్ ) పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేకపోతే కేసు పెడతామని హెచ్చరించారు సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్. రాహుల్ మార్చి 25న ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తన యూకే వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలా వద్దా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, క్షమాపణ అడగడానికి తాను సావర్కర్ ను కాదని గాంధీనని తెలిపారు.
"సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోతే నేను అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను" అని వీడీ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ తెలిపారు. బ్రిటీష్ అధికారులకు సావర్కర్ క్షమాపణలు చెప్పినట్లు రుజువు చేయాలని రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. రాహుల్ గాంధీ ఏం చేసినా చిన్నపిల్లాడిలా ఉంటుందని అన్నారు.
సావర్కర్ పై కామెంట్స్ చేయడం రాహుల్ కు ఇది మొదటిసారి కాదని అన్నారు. గత ఏడాది రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా సావర్కర్ గురించి అనుచితంగా మాట్లాడారని తెలిపారు. సావర్కర్ బ్రిటీష్ అధికారులకు పలుమార్లు క్షమాపణ కోరుతూ ఉత్తరాలు రాసారని ప్రచారం చేసినట్లు చెప్పారు. దీంతో పాటు.. స్వతంత్ర పోరాటంలో బ్రిటీష్ వారికి సావర్కర్ సహాయం చేశారనికూడా రాహుల్ అన్నారని రంజిత్ సావర్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ నిరూపించాలని లేకపోతే కేసు వేస్తామని స్పష్టం చేశారు. కాగా.. 2019 పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు మార్చి 23న రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక రోజు తర్వాత, అతను లోక్‌సభకు అనర్హుడయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com