రష్యా నుంచి వచ్చిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్

రష్యా నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వచ్చేసింది. మాస్కో నుంచి బయలు దేరిన ప్రత్యేక విమానం... హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. మొదటి దశలో 1.50 లక్షల డోసులు వచ్చాయి. ఈ నెలలోనే మరో మూడు మిలియన్ డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు రానున్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రాకతో ప్రస్తుతం మన దేశంలో మూడు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చినట్లైంది.
ఇప్పటిదాకా మన దేశంలో ఉత్పిత్తి అయిన కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రెండింటి ఉత్పత్తి కూడా తక్కువగా ఉండడం... డిమాండ్ పెరగడంతో భారీగా కొరత ఏర్పడుతోంది. దీంతో గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం స్పుత్నిక్ వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతిని ఇచ్చింది. 50 మిలియన్ స్పుత్నిక్ వి టీకా డోసుల కోసం మన దేశం ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే మే 1న భారత్‌కు టీకా పంపిస్తామని చెప్పిన రష్యా కంపెనీ... అన్నట్లుగానే పంపించింది. స్పుత్నిక్ వి టీకా రాకతో మన దేశంలో వ్యాక్సిన్ కొరత కొంత తీరుతుందని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com