75 మంది ప్రాణాలు కాపాడిన యువకుడి వెబ్ సిరీస్ పిచ్చి

75 మంది ప్రాణాలు కాపాడిన యువకుడి వెబ్ సిరీస్ పిచ్చి
పడుకునే పన్లేదా.. అర్థరాత్రి అయినా ఆ ఫోన్లోనేనా..

పడుకునే పన్లేదా.. అర్థరాత్రి అయినా ఆ ఫోన్లోనేనా.. అమ్మ రోజూ పాడే పాటే. అయినా వినకుండా కునాల్ ఆ రోజు వెబ్ సిరీస్ మొత్తం చూసే పడుకోవాలనుకున్నాడు.. అదే పనిగా ఫోన్ చూస్తున్నాడు.. అందరూ నిద్ర పోవడంతో ఏ చిన్న సౌండ్ అయినా వినిపిస్తుంది. దాంతో కిచెన్‌లో కూలిన పై కప్పు శబ్ధం కునాల్ చెవిన పడింది.

ముంబైలోని డోంబివ్లిలో రెండు అంతస్తుల భవనంలో 75 మంది నివాసితుల ప్రాణాలను కునాల్ మోహితే అనే 18 ఏళ్ల బాలుడు రక్షించాడు. కునాల్ తెల్లవార్లూ చూస్తున్న వెబ్ సిరీసే అంత మంది ప్రాణాలు కాపాడింది. అతడు తెల్లవారుజామున 4 గంటల వరకు స్మార్ట్‌ఫోన్‌లో వెబ్ సిరీస్ చూస్తున్నాడు. వంటగదిలోని పై కప్పు కూలి పెద్ద శబ్ధం వచ్చింది. దాంతో కునాల్ వెంటనే అమ్మానాన్నని ఆ భవనంలో ఉన్న మిగతా వారిని అప్రమత్తం చేశాడు. నిద్ర కళ్లతో ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ బయటకు వచ్చారు. నిమిషాల్లో భవనం మొత్తం ఖాళీ అయిపోయింది. వారి కళ్ల ముందే కుప్పకూలిపోయింది.

అయితే ఈ భవనం 9 నెలల క్రితమే 'ప్రమాదకరమైనది' గా ప్రభుత్వం ప్రకటించబడింది. అయినా అందులోనే ఉన్నారు. కునాల్ మాట్లాడుతూ, "మాకు అధికారుల నుండి నోటీసు వచ్చింది, కాని ఇక్కడ నివసించే ప్రజలు ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు. మా అందరికీ మరోచోటుకి వెళ్ళడానికి స్థలం లేదు, అందుచేత ఇక్కడే ఉండిపోయాము అని మీడియాతో వివరించాడు.''

ఈ సంఘటన విన్న నెటిజన్లు ఆ యువకుడిని 'హీరో' అని ప్రశంసిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ జీవితంలో మీరు విజయం సాధిస్తారు అని ట్విట్టర్ యూజర్ రాశారు. మరొక వ్యక్తి ఇలా వ్రాశాడు, "బ్రిలియంట్! ఈ రోజు నుండి, తల్లిదండ్రులు తమ పిల్లలను వెబ్-సిరీస్ లేదా ఇతర టీవీ ఛానెల్స్ వేకువజాము వరకు చూస్తుంటే వారిని తిట్టకూడదు ఎందుకంటే ఎవరికి తెలుసు.. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో'' అని పేర్కొన్నాడు.

Tags

Next Story