ఇద్దరు గని కార్మికులకు దొరికిన విలువైన వజ్రాలు.. వేలంలో లక్షలు

ఇద్దరు గని కార్మికులకు దొరికిన విలువైన వజ్రాలు.. వేలంలో లక్షలు
ఆ ఆశతోనే మధ్యప్రదేశ్ పన్నా జిల్లా కార్మికులు గనుల్లో రేయింబవళ్లు పని చేస్తుంటారు..

అక్కడ వజ్రాలు దొరుకుతాయని తెలుసు కార్మికులకు.. కానీ అదృష్ట దేవత ఎవరి తలుపుతడుతుందో తెలియదు.. ఆ ఆశతోనే మధ్యప్రదేశ్ పన్నా జిల్లా కార్మికులు గనుల్లో రేయింబవళ్లు పని చేస్తుంటారు.. మొన్నటికి మొన్న ఓ గని కార్మికుడి 7.24 క్యారెట్ల విలువైన వజ్రం దొరికింది.. దాన్ని వేలం వేయగా 40 లక్షలు పైగానే పలికింది. అందులో కొంత పోగా మిగిలిన నగదును కార్మికుడికి అందజేశారు అధికారులు.

తాజాగా గనిలో పని చేస్తున్నమరో ఇద్దరు కార్మికులకు 7.44, 14.98 క్యారెట్ల బరువున్న రెండు వజ్రాలు దొరికాయి. జరువపూర్‌లోని ఒక గని నుండి దిలీప్ మిస్త్రీకి 7.44 క్యారెట్ల విలువైన వజ్రం కనిపించగా, కళ్యాణ్ పూర్ ప్రాంతంలో లఖన్ యాదవ్ కృష్ణకు 14.98 క్యారెట్ల విలువైన వజ్రం దొరికినట్లు ఇన్‌స్పెక్టర్ అనుపమ్ సింగ్ తెలిపారు.

ఈ రాళ్లను డైమండ్ కార్యాలయానికి అప్పగిస్తారు. అక్కడ వారు దానికి విలువ కట్టి వేలం వేస్తారు. 12.5 శాతం రాయల్టీ తగ్గింపు తర్వాత కార్మికులకు మిగిలిన మొత్తాన్ని అందిస్తారు. 7.44 క్యారెట్ల బరువున్న రాయికి సుమారు రూ.30 లక్షలు వస్తాయని, ఇంకో రాయి విలువ దీనికంటే రెట్టింపు బరువున్నందున దానికి కూడా పెద్ద మొత్తంలో నగదు అందుతుందని అధికారులు తెలిపారు. కాగా కార్మికులు తమకు వజ్రం దొరకడంతో తమ జీవితాలు మారనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండెకరాల భూమి ఉన్న చిన్న రైతు లఖన్ యాదవ్‌‌కు వజ్రాలు వెలికి తీయడం ఇదే మొదటిసారి. వచ్చిన డబ్బుతో పిల్లలకు మంచి జీవితాన్ని అందిస్తానని చెబుతున్నాడు. దిలీప్ మిస్త్రీ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా మేము నలుగురం వ్యక్తులం కలిసి మా ప్రైవేట్ భూమిలో వజ్రాలు వెలికి తీసే కార్యక్రమం చేపట్టాం. భగవంతుని దయవల్ల నాకు ఈ రోజు మంచి నాణ్యత గల వజ్రం మొదటిసారిగా లభించింది అని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. బుందేల్‌ఖండ్‌లోని వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పన్నా వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది.

Tags

Next Story