ప్రియమైన 'డాగీ' ఇక లేదని తెలిసి యువతి ఆత్మహత్య..

ప్రియమైన డాగీ ఇక లేదని తెలిసి యువతి ఆత్మహత్య..
X
మంగళవారం రాత్రి తన పెంపుడు శునకం బాబు మరణించడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది

ప్రేమగా పెంచుకున్న పెంపుడు జంతువులతో యజమానులకు ఎనలేని అనుబంధం ఏర్పడుతుంది.. విశ్వాసానికి మారుపేరైన శునకాలను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారు.. ఇంట్లో అందరికీ ఆప్తమిత్రుడిగా అవ్యాజమైన ప్రేమను పంచే శునకం మరణిస్తే ఇంటిల్లపాది శోకసంధ్రంలో మునిగిన సంఘటనలు ఎన్నో చూస్తుంటాం.. కానీ తాజాగా ఓ యువతి ముద్దుగా పెంచుకున్న జర్మన్ షెపర్డ్ మరణించేసరికి తట్టుకోలేకపోయింది. ఆ బాధతో అది మరణించిన రెండో రోజే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాయపూర్‌కు చెందిన ప్రియాంశు సింగ్ (23). మంగళవారం రాత్రి తన పెంపుడు శునకం బాబు మరణించడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రియాంశు కుటుంబం అర్థరాత్రి వరకు మెలకువతో ఉండి బాబు జ్ఞాపకాలను నెమరువేసుకోసాగారు. అనంతరం ప్రియాంశు తన సోదరితో కలిసి నిద్రించడానికి వెళ్లింది. బుధవారం ఉదయం చూసేసరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆ పక్కనే సూసైడ్ నోట్ ఉంది. అందులో బాబు పక్కనే తననీ ఖననం చేయాలని పేర్కొంది.

షాక్ అయిన పొరుగువారు బాబుని ఆమె ఎంతగానో ప్రేమించేదని చెప్పారు. "బాబు జర్మన్ షెపర్డ్‌కు చెందిన మిశ్రమ జాతి. మా గ్రామంలో ఆమె జంతువులు, పిల్లల పట్ల ఉదారంగా ఉండేది. ఆమె గ్రామంలోని పిల్లలకు ఉచితంగా చదువు చెబుతుంది "అని గ్రామస్థుల్లో ఒకరైన పప్పు చౌహాన్ అన్నారు.

బాబు మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబసభ్యులకు, కుమార్తె మరణం మరింత దుఖాన్ని మిగిల్చింది. బాబును ఇంటి సమీపంలో ఖననం చేయగా, ప్రియాంశు మృతదేహాన్ని బుధవారం రాత్రి గూర్ఖా గ్రామ శివార్లలో దహనం చేశారు.

Next Story