Himanta Biswa Sarma : అస్సాం సీఎం లవ్ స్టొరీ తెలుసా.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..!

అతని వయసు 22 ఏళ్లు... ఆమె వయసు 17 ఏళ్లు... ఆ అమ్మాయిని చూసిన తొలిచూపులోనే ఇష్టపడ్డాడు.. ఆ ఇష్టాన్ని ఏమాత్రం తడబడకుండా ఆ అమ్మాయికి చెప్పేశాడు... ఆ అమ్మాయి కూడా తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ... "భవిష్యత్తులో ఏ ఉద్యోగం చేస్తాడని ఇంట్లో ఆడిగితే ఏం చెప్పను.." అని అడిగేసింది.. ఆమె ప్రశ్నకి ఏ మాత్రం భయపడకుండా.. "ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పు మీ అమ్మకి అని అన్నాడట.."
ఇది సరిగ్గా 30 ఏళ్ల కింద జరిగిన సంఘటన. అన్నట్టుగానే అతను సీఎం అయ్యాడు... ఇంతకీ అతను ఎవరనదే కదా... తాజాగా అస్సాం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ.. ఆ అమ్మాయి కూడా ఎవరో కాదు.. పదేళ్ల తర్వాత ఆయన్ని వివాహం చేసుకున్న రివికి భుయాన్ ... తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది ఆమె.
" నేను ఆయన(హిమంత)ను తొలిసారి కలిసినప్పుడు .. ఎదో ఒక రోజు అస్సాంకు ముఖ్యమంత్రిని అవుతానని ఇంట్లో చెప్పు అన్నప్పుడు షాక్ అయ్యాను.. నేను పెళ్లిచేసుకోవాలనుకునే వ్యక్తికి కచ్చితమైన లక్ష్యం ఉందని నాకు అర్థమైంది. రాష్ట్రానికి ఏదో చేయాలనే ఆకాంక్ష ఉందని తెలిసింది. మా పెళ్లి జరిగినప్పుడు ఆయన ఓ ఎమ్మెల్యే.. ఆ తరవాత మంత్రి అయ్యారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే నమ్మలేకపోయాను. 22 ఏళ్ళ వయసులో ఆయన నాకు చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమయ్యాయి. దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని అన్నారు.
52 ఏళ్ల హిమంత గువాహటిలోని కాటన్ కాలేజీలో డిగ్రీ, పీజీ చదివారు. అక్కడే ఆయనకీ ఈ రివికి భుయాన్ పరిచయమయ్యారు. పదేళ్ళ ప్రేమ తర్వాత 1991 మే నెలలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లున్నారు. కాగా గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ్ కళాక్షేత్రంలో అస్సాం 15 వ ముఖ్యమంత్రిగా హిమాంత బిశ్వశర్మ మే 10న ప్రమాణస్వీకారం చేశారు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com