కేంద్ర కేబినెట్‌లో 33 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు
పునర్ వ్యవస్థీకరణ తర్వాత కొత్తగా కొలువుదీరిన కేంద్ర కేబినెట్‌లో 33 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్-ADR తన నివేదికలో వెల్లడించింది. వీరిలో 24 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ లాంటి తీవ్రమైన నేర అభియోగాలు నమోదయ్యాయని పేర్కొంది. మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులే జరిగాయి. కొత్తగా 36 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 78కి పెరిగింది. ఈ నూతన మంత్రిమండలిలో 42శాతం అంటే 33 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయట.
ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ADR ఈ నివేదిక రూపొందించింది. 2019లో తొలి మంత్రివర్గంలో 56 మంది మంత్రులుండగా వారిలో 39శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అప్పటితో పోలిస్తే ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరగింది. ఇక కొత్త మంత్రివర్గంలో 90శాతం అంటే 70 మంది మంత్రులు కోటీశ్వరులేనని ఏడీఆర్ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. పౌర విమానయానశాఖ నూతన మంత్రి జ్యోతిరాదిత్య సింధియానే అత్యంత సంపన్న మంత్రి. ఆయన ఆస్తుల విలువ 379కోట్లకు పైనే. ఆ తర్వాత 95కోట్లు ఆస్తులతో పీయూష్ గోయల్ రెండోస్థానంలో ఉన్నారు.. ఆ తర్వాత నారాయణ్ రాణె- 87కోట్లు, రాజీవ్ చంద్రశేఖర్- 64కోట్లతో అత్యంత సంపన్న మంత్రుల జాబితాలో ఉన్నారు. కేంద్రంలో మొత్తం మంత్రుల సగటు ఆస్తుల విలువ 16 కోట్ల 24 లక్షలుగా ఉంది.
కేబినెట్ మంత్రుల్లో అతి తక్కువ ఆస్తులు ఉన్న వ్యక్తి ప్రతిమా భౌమిక్. త్రిపురకు చెందిన ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు 6 లక్షలు. పశ్చిమబెంగాల్‌కు చెందిన జాన్ బార్లాక ఆస్తువల విలువ14లక్షలు. రాజస్థాన్‌కు చెందిన కైలాశ్ చౌదరీ, ఒడిశాకు చెందిన బిశ్వేశ్వర్ తుడుకు , మహారాష్ట్ర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మురళీధరన్ అతి తక్కువ ఆస్తులున్న మంత్రుల జాబితాలో ఉన్నారు..
కొత్త మంత్రుల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులే. 21 మంది మంత్రులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా.. 9 మంది మంత్రులు డాక్టరేట్ అందుకున్నారు. ఇక 17 మంది గ్రాడ్యుయేషన్, మరో 17 మంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ముగ్గురు మంత్రులు పదో తరగతి పూర్తిచేయగా.. మరో ఇద్దరు మంత్రులు 8వ తరగతి, ఏడుగురు ఇంటర్ చదివినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నివేదిక వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com