Karnataka : విషసర్పాలను చేతితో అలవోకగా.. ఈమె డేరింగ్ చూస్తే షాకే..!

Karnataka : పామును చూస్తే ఎవరికైనా భయమేస్తోంది.. ఇక చిన్నపిల్లలు పామును చూస్తే పరిగెడతారు. కానీ కర్ణాటకకు చెందిన ఓ యువతి మాత్రం అందుకు విరుద్దం.. పాములను చేతితో పట్టుకుంటుంది. అంతేకాదండోయ్ వాటిని సురక్షితంగా అడవిలోకి విడిచిపెడుతోంది. ఇలా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా వందకి పైగా విషసర్పాలను అలా చేతితో పట్టుకొని అడవిలో విడిచిపెట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మంగళూరులోని అశోక నగర ప్రాంతంలో నివాసం ఉంటుంది శరణ్య భట్ ... ప్రస్తుతం ఆమె బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె ఉండే చుట్టుపక్కల ఎవరి ఇంట్లోనైనా సరే పాములు చొరబడ్డాయంటే అక్కడికి వెళ్లి తన టెక్నిక్‌తో వాటిని పట్టుకుంటుంది. అన్నీ జాగ్రత్తలు తీసుకునే వాటిని పట్టుకుంటానని చెబుతోంది శరణ్య.. హుక్-హ్యాండిల్ పద్ధతిలో పాములను పట్టుకుంటే పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పుకోస్తోంది ఈ యువతి.
అయితే ఆమెకి వీటిపైన ఇంట్రెస్ట్ రావడానికి కారణం మాత్రం తన తాతయ్య ప్రకాశ్ అని చెబుతోంది. పాములు, ఇతర జీవుల గురించి ఆయన చెప్పేవారని, దీంతో వీటి సంరక్షణపై ఆసక్తి ఏర్పడిందని తెలిపింది. పాములను అలవోకగా పట్టుకోవడంలో పట్టు సాధించిన శరణ్య.. ఇప్పుడు కప్పలపై అధ్యయనం చేస్తోంది. వీటిపైన ఎమ్మెస్సీ చేయడమే తన లక్ష్యమని అంటుంది.
శరణ్యకి వీటితో పాటుగా సంగీతం, డాన్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది. ప్రస్తుతం ఆమె కర్ణాటక సంగీతం, భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com