Pratiksha Tondwalkar: స్వీపర్ నుండి ఎస్బీఐ ఏజీఎం వరకు.. ప్రతీక్ష తొండల్వాల్కర్ సక్సెస్ స్టోరీ..

Pratiksha Tondwalkar: స్వీపర్ నుండి ఎస్బీఐ ఏజీఎం వరకు.. ప్రతీక్ష తొండల్వాల్కర్ సక్సెస్ స్టోరీ..
Pratiksha Tondwalkar: ఆశలు బలంగా ఉండాలి.. ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. అప్పుడే కష్టాలను కూడా ఇష్టంగా స్వీకరిస్తాం. ఎంచుకున్న మార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవలీలగా అధిగమిస్తాం.

Pratiksha Tondwalkar: ఆశలు బలంగా ఉండాలి.. ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. అప్పుడే కష్టాలను కూడా ఇష్టంగా స్వీకరిస్తాం. ఎంచుకున్న మార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవలీలగా అధిగమిస్తాం. తాను చదువుకుంది పదోతరగతే అని తనకి స్వీపర్ ఉద్యోగం కాక మరేది వస్తుందని ఆమె నిరుత్సాహ పడిపోలేదు.. తాను పని చేస్తున్న బ్యాంకులో అధికారులను చూసి తానూ బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలని ఆశపడింది. అందుకోసం రేయింబవళ్లు కష్టపడింది. ఇప్పుడు అదే బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో ఉండి నీరాజనాలు అందుకుంటోంది పూణేకు చెందిన ప్రతీక్ష తొండల్వాల్కర్. ఆమె జర్నీ ఎందరికో స్ఫూర్తిదాయకం..

1964లో పూణేలో జన్మించిన తొండల్వాల్కర్ నిరుపేద కుటుంబానికి చెందినది. 16 ఏళ్ల వయసులోనే ఎస్‌బీఐలో బుక్ బైండర్‌గా పనిచేస్తున్న సదాశివ్ కడుతో వివాహం జరిగింది. అప్పటికి ఆమె 10 వ తరగతి కూడా పూర్తి చేయలేకపోయింది. వివాహం అయిన ఏడాదిలోపే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది రోజులు తల్లిదగ్గర ఉండేందుకు గ్రామానికి వెళ్లింది.

కొడుకు రాకతో జీవితం సంతోషంగా గడుస్తుంది అని అనుకునేలోపు విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయింది. అప్పటికి ఆమెకు 20 ఏళ్ల వయసు. అంత చిన్న వయస్సులో వితంతువుగా మారడంతో ఆమె జీవితం అంధకారం అయింది.

కానీ తాను బతకాలి.. కొడుకును బతికించాలి.. కన్నీళ్లను దిగమింగుకుంటూ భర్త పనిచేసిన ఎస్బీఐ శాఖలో అడుగుపెట్టింది. భర్త తాలూకు అందాల్సిన బకాయిలను వసూలు చేయడానికి బ్యాంకుకు చేరుకుంది. తను, కొడుకు బతకాలంటే ఏదో ఒకటి చేయాలి. కానీ అందుకు కావలసిన అర్హత లేదు. కాబట్టి, తాము బ్రతికేందుకు ఏదో ఒక ఆధారం చూపించమని బ్యాంకు అధికారులను అడిగింది.

SBIలో స్వీపర్‌గా పనిచేసేందుకు అవకాశం కల్పించారు బ్యాంకు అధికారులు. అయితే ఆమె అంతటితో సంతృప్తి చెందలేదు. ఆఫీసులో పనిచేసే వ్యక్తులను చూసి వారిలో ఒకరిగా ఉండాలనుకుంది. అదే విషయాన్ని అక్కడి బ్యాంక్ ఎంప్లాయీస్‌తో పంచుకోగా వాళ్లు ఆమెకు అన్నివిధాలుగా సహాయం చేస్తామన్నారు.. చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

ముంబై విక్రోలిలోని నైట్ కాలేజీలో చేరింది. 1995లో సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆమె నిబద్ధతను, శ్రద్ధను గమనించిన అధికారులు స్వీపర్ నుండి క్లర్క్‌గా పదోన్నతి కల్పించారు. ఈ ప్రక్రియ అక్కడితో ముగియలేదు. తర్వాత ఆమె స్కేల్ 4కి, ఆ తర్వాత CGMకి, ఇటీవల AGMకి ప్రమోషన్ పొందింది.

పరీక్షా ఫారమ్‌లను నింపడం నుండి స్టడీ మెటీరియల్ పొందడం వరకు బ్యాంక్‌లోని కొంతమంది అధికారులు ఆమెకు అడుగడుగునా సహాయం చేశారు అని తన ఘనతకు కారణమైన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతుంది ప్రతీక్ష.

ఆమె ఆశయాలన్నింటికీ మద్దతునిస్తూ తోడుగా నిలిచిన ప్రమోద్ తొండల్వాకర్‌‌ని 1993లో వివాహం చేసుకుంది. ప్రతిక్ష తన పట్టుదల, నిబద్ధత మరియు నిజాయితీతో కూడిన శ్రద్ధ కారణంగా ఆమె అద్భుతమైన విజయాలు సాధించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే గౌరవించబడింది.

ప్రతీక్ష పదవీ విరమణ చేయడానికి మరో రెండేళ్లు మిగిలి ఉంది. ఎస్‌బిఐలో ఆమె 37 ఏళ్ల ఉద్యోగ జీవితం విజయవంతం అయినప్పటికీ, ఆమె ఇంకా చాలా దూరం ప్రయాణించాలనుకుంటోంది. 2021లో నేచురోపతి ప్రోగ్రామ్ నుండి పట్టభద్రురాలైంది. పదవీ విరమణ చేసిన తర్వాత ఆమె తన విద్యను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలని యోచిస్తోంది.

పురుషాధిపత్య బ్యాంకింగ్ పరిశ్రమలో ప్రతీక్ష కథ విశేషమైనది. కష్టాలకు కృంగిపోకుండా అందులోనూ అవకాశాలు వెతుక్కోవచ్చని నిరూపించింది ప్రతీక్ష తొండల్వాల్కర్.

Tags

Read MoreRead Less
Next Story