సర్లే ఎన్నెన్నో అనుకుంటాంగానీ.. ఆఖరికి అభిజీత్ విన్నర్

సర్లే ఎన్నెన్నో అనుకుంటాంగానీ.. ఆఖరికి అభిజీత్ విన్నర్
అరవడు.. కానీ మైండ్‌తో గేమ్ ఆడి అరిపిస్తాడు.. పదకొండు సార్లు ఎలిమినేట్ అయి..

దేనికి అతిగా స్పందించడు.. సైలెంట్‌గా ఉంటాడు.. ఫైట్ చేయడు.. కానీ గెలుస్తాడు.. అరవడు.. కానీ మైండ్‌తో గేమ్ ఆడి అరిపిస్తాడు.. పదకొండు సార్లు ఎలిమినేట్ అయి.. ఫైనల్‌కి చేరిన అయిదుగురిలో తానొకడై.. ఆఖరికి అందరి నమ్మకాన్ని వమ్ము చేయక తానే బిగ్‌బాస్ విన్నరై కప్ అందుకున్నాడు చిరు చేతుల మీదుగా అభిజిత్. అసలైతే బిగ్‌బాస్ విన్నర్‌కి ప్రైజ్‌మనీ రూ.50 లక్షలు. కానీ సోహైల్ పోటీ నుంచి తప్పుకోవడానికి రూ.25 లక్షలు తీసుకున్నాడు. దీంతో ఈ మొత్తాన్ని ప్రైజ్ మనీ నుంచి కట్ చేశారు. దీనికి అఖిల్, అభిజీత్ కూడా అంగీకరించారు. దాన్నిబట్టి విజేతకు రూ.25 లక్షలు మాత్రమే మిగిలింది. ఇక మిగిలిన నగదును, టైటిల్ ట్రోఫీని అభిజీత్ సొంతం చేసుకున్నాడు.

అయితే సోహెల్, అఖిల్, అరియానా, హారిక కూడా గట్టి పోటీనే ఇచ్చారు. ఒకానొక దశలో ప్రేక్షకులు సోహెల్ విన్నరవుతాడని విశ్వసించారు. ఆ క్షణంలో కోపం వచ్చి అరిచినా వెంటనే కూల్ అవుతాడు.. త్యాగాలు చేస్తాడు.. స్నేహానికి ప్రాణం ఇస్తాడు.. అన్నీ ఎమోషన్స్‌ని ఏక కాలంలో పండిస్తాడు.. ఏదో వీక్ పాయింట్ అతడిని విన్నర్ అవకుండా వెనక్కి నెట్టింది.. ఇక అఖిల్ కూడా టాస్కుల్లో ఇరగదీసినా పులిహోర కలపడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు కప్ గెలుచుకోవడానికి అర్హుడు కాలేకపోయాడు..

ప్రేక్షకుల ఓట్లతో అఖిల్‌ని వెనక్కు నెట్టారు. హారిక, అరియానా ఈసారైనా బిగ్‌బాస్ టైటిల్ అమ్మాయిలకు రావాలని కలలుకన్నారు. కానీ బిగ్‌బాస్ పార్షియాలిటీ చూపించాడో.. అమ్మాయిలకు అంత సీన్ లేదనుకున్నాడో.. ఓట్లు తక్కువగా పోల్ అయ్యాయో ఏమో కానీ మొత్తానికి చరిత్రను తిరగరాసే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు.. ఎప్పటిలాగే అబ్బాయిలకే పట్టం కట్టారు.. మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న అభిజిత్‌కే కప్పందించారు.

ఇదిలా ఉంటే, ఆదివారం నాడు అంగరంగ వైభవంగా సాగిన గ్రాండ్ ఫినాలే సీజన్ 4 కంటెస్టెంట్స్ అంతా హాజరై ఆటపాటలతో అలరించారు. టాప్ 5 ఫైనలిస్ట్‌ల్లో హారిక ఐదో స్థానంతో, అరియానా నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోహెల్ మూడో స్థానం దక్కించుకుంటే అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు.

ఇక బిగ్‌బాస్ విన్నరైన అభిజిత్ 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. రామ్ లీలా, మిర్చిలాంటి కుర్రాడు, అరెరె సినిమాల్లో నటించాడు. అయితే ఈ సినిమాలతో పెద్దగా పేరు రాకపోవడంతో.. 2015 నుంచి 2017 వరకు గ్యాప్ తీసుకుని పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ సిరీస్ 1,2,3 అన్నీ సూపర్ హిట్ కావడంతో అభిజిత్‌కి మంచి పేరు వచ్చింది.

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టడం అతడికి ప్లస్ పాయింట్ అయింది. అందం, తెలివి, కామ్ గోయింగ్ అన్నీ కలిసి అభిజిత్ బిగ్‌బాస్ టైటిల్ గెలవడానికి దోహదపడింది. తాజా ఎపిసోడ్‌లో కూడా బిగ్‌బాస్.. మీ లాంటి మెచ్యూర్డ్ కంటెస్టెంట్ హౌస్‌లో ఉండడం గర్వంగా ఉందని కితాబిచ్చారు. దానిక్కూడా అభిజిత్ ఎంత మాత్రం ఓవర్‌గా రియాక్ట్ అవకుండా థ్యాంక్యూ బిగ్ బాస్ అంటూ కూల్‌గా చెప్పాడు. దటీజ్ అభిజీత్ అనిపించుకున్నాడు.

Tags

Next Story